లడ్డూ తయారీ అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి : సిపిఎం

తిరుమల : తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో జరిగిన అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్‌ చేశారు. టిటిడి లడ్డూలో వాడుతున్న నెయ్యిలో కల్తీ జరిగిందని, ఇతరేతర పదార్థాలు వాడారని జరుగుతున్న ప్రచారంతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన కలుగుతున్నదని అన్నారు. ప్రభుత్వం ఎన్‌ డి డి బి రిపోర్టుని అధికారికంగా ప్రకటించి విచారణ జరిపించాలని నాగరాజు కోరారు. ఈ వివాదంపై టీటీడీ ఉన్నతాధికారులు మౌనం వీడి సమాధానం చెప్పాలని గుజరాత్‌ ఎన్డిడిబి డైరీ కి శాంపుల్‌ ఎప్పుడు పంపారు ? ఎవరు పంపారు? రిపోర్టు ఏమి వచ్చింది తదితర వివరాలను వెల్లడి చేయాలని డిమాండ్‌ చేశారు. టీటీడీ పరిధిలో ఉన్న ల్యాబ్‌ పరిశీలనలో కల్తీని గుర్తించారా ? గుర్తించి ఉంటే చర్యలు ఏమైనా తీసుకున్నారా ? తదితర విషయాలను వెల్లడి చేయాలని కోరారు. ఈ వివాదం మాటున మత మనోభావాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని, ప్రజలు ఇలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని నాగరాజు విజ్ఞప్తి చేశారు.

➡️