ప్రజాశక్తి-బద్వేలు సుందరయ్య కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీను డిమాండ్ చేశారు. గురువారం పూసలవాడ సచివాలయం దగ్గర సుందరయ్య కాలనీ ప్రజలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం కాలనీ ఏర్పాటైందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని ఇళ్లకు మాత్రమే డోర్ నెంబర్లు వేశారని మరికొన్ని ఇళ్లకు డోర్ నెంబర్లు వేయలేదని తెలిపారు. ఎన్నిసార్లు అధికారకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో వంద ఇళ్లకు పైబడి మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. పొలాలలోకి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. మంచినీటి వసతి కల్పించడంలో మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా, పోరాటాలు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. పేద ప్రజలు చందాలు పోగేసుకొని పైప్ లైన్స్ వేసుకుంటే మున్సిపాలిటీ అధికారులు కనెక్షన్ ఇవ్వడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ కనెక్షన్ ఇవ్వమని చెప్తే పూసలవాడ సచివాలయం సిబ్బంది కిషోర్ అడ్డుపడుతున్నాడన్నారు. కమిషనర్‌కి లేనిపోని మాటలు చెప్పి పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని అలాంటి అధికారిని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తక్షణం తాగునీటి సమస్య పరిష్కరించకుంటే అధికారులను అడ్డుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు ముడియం చిన్ని, మోక్షమ్మ, కైరున్ బి.రామలక్ష్మమ్మ, ఫాతిమా, మాధవి, దేవి, చంద్రకళ, స్వీటీ, అరుణ, రమాదేవి, ఎస్.కె ఆదిల్, ఖలీల్, జోషి, చంద్రశేఖర్, గోవర్ధన్, రవి, గంప సుబ్బరాయుడు, బాలస్వామి, సుబ్బయ్య పాల్గొన్నారు.
