రైతులను ఆదుకోవాలి : సిపిఎం

Jun 11,2024 14:54 #Annamayya district, #cpm

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్య) : అరటి, మామిడి, వరి పంటలను వేసిన రైతులను నూతన ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు కోరారు. రాజంపేట మండలంలో మంగళవారం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి.హెచ్‌ చంద్రశేఖర్‌, చిట్వేల్‌ రవికుమార్‌, మణి కొన్ని చెర్లోపల్లి, చెంచు రాజుగారి పల్లి, హస్తవరం తాళ్లపాక గ్రామాలతో పాటు రాజంపేట మార్కెట్‌ యార్డ్‌లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులలో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా అప్పుల్లో మునిగిపోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరా అరటికి ఒకటిన్నర లక్ష పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని, ఎరువులు దుక్కి కూలీలు, తదితర వాటికి పెట్టుబడి తీవ్ర స్థాయిలో ఉండన్నారు. ఆకేపాడు ప్రాంతంలో 500 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారని, పకృతి వైపరీత్యాల వల్ల గాలులకు అరటి పంట తీవ్రంగా నష్టపోయిందన్నారు. అన్నమయ్య డ్యాం తెగిపోవడం వలన బోరులో భూగర్భ జలం అడుగంటి పుష్కలంగా నీరు అందడం లేదన్నారు. మామిడి రైతులకు ఈసారి కాపు సరిగా రాలేదని, ఎరువులు, దున్నకాలకు, కూలీలకు, పెట్టిన పెట్టుబడి ఖర్చు కూడా రాలేదన్నారు. వచ్చిన పంట తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెనిషకు కిలో రూ.30 రైతులకు చెల్లిస్తారని.. వ్యాపారస్తులు రూ 50 అమ్ముకుంటారని, కొందరు చిన్న వ్యాపారస్తులు పంట కాపు పైన రెండు మూడు సంవత్సరాలకు కొనుగోలు చేస్తారన్నారు. పకృతి వైపరీత్యాలు, తెగుళ్లు వల్ల వీరు కూడా కూడా నష్టపోవాల్సి వస్తుందన్నారు. తాళ్లపాక ప్రాంతంలో వరి పంట అధికంగా వేస్తారని, విత్తనం ఎల్‌-2 25 కేజీలు రూ 2000 కు కొనుగోలు చేస్తారని, ఎకరాకు 70బస్తాలు దిగుబడి వస్తుందని, బస్తా రూ 1600 కు కొనుగోలు చేస్తారని తెలిపారు. నాలుగు నెలలకు దిగుబడి వస్తుందని, దుక్కులు, కూలీలు, ఎరువులు, ఖర్చులు పోనూ పకతి వైపరీత్యాలు లేకుంటే ఆఖరికి గడ్డి మిగులుతుందన్నారు. కావున గత ప్రభుత్వంలో రైతులు నిర్లక్ష్యానికి గురయ్యారని, నూతన ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని, గాలులకు నష్టపోయిన అరటి, మామిడి, వరి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

➡️