ప్రజాశక్తి-గిద్దలూరు : సిపిఎం ప్రజా అధ్యయన యాత్రలో భాగంగా మంగళవారం గిద్దలూరు నగర పంచాయతీ మోడంపల్లె పరిధిలో నేషనల్ హైవే ఆనుకుని ఏడేళ్ల క్రితం నిర్మించిన టిడ్కో ఇండ్లను సిపిఎం బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు టి ఆవులయ్య మాట్లాడుతూ 2018 తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఏడేళ్ల క్రితం ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని, పేదల సొంతింటి కలను నెరవేర్చాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. గత ఏడేళ్లుగా లబ్ధిదారులు అధికార, ప్రతిపక్ష రాజకీయ ఉచ్చుకు బలయ్యారని అన్నారు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభం చేపట్టిన టిడ్కో ఇళ్ల ప్రక్రియను ఆ తరువాత అధికారం చేపట్టిన వైసిపి ప్రభుత్వం రాజకీయ రంగుతో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు. 9 నెలల క్రితం తిరిగి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసేందుకు మొదటి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకుండా బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదని అన్నారు. టిడ్కో ఇళ్లు కేటాయించిన లబ్ధిదారుల నుంచి బ్యాంకు రుణాలు మంజూరు చేయించి, గృహాలు పొందకుండానే వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా టిడ్కో ఇళ్లకు మౌలిక సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి నర్సింహులు, డి శ్రీనివాసులు, డివిఎన్ మూర్తి, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తి: గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో రూ.2.5 కోట్ల నిధులు కేటాయించాలని, ఏడాదికి 200 పని దినాలు పెంచాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూసపాటి వెంకటరావు డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని కెవి పాలెం, గ్రామాలలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఉపాధి హామీ కార్మికులతో సమస్యలపై మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని పట్టణాలకు కూడా విస్తరింపజేయాలని, పని ప్రదేశాలలో కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక 9 నెలలు అవుతున్నా ఆ ఊసే లేదని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పులి ఓబుల్‌రెడ్డి, నెల్లూరు కృష్ణయ్య, కొల్లూరు అక్కయ్య, బ్రహ్మయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
