ఇసుక సమస్యపై రేపు ధర్నాలు, నిరసనలు : సిపిఎం

Oct 3,2024 00:16

మాట్లాడుతున్న సిహెచ్‌ బాబూరావు
ప్రజాశక్తి-గుంటూరు :
ఎన్నికల్లో టిడిపి కూటమి వాగ్దానం ప్రకారం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతూ శుక్రవారం అన్ని మండలాలు, పట్టణ కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు పిలుపుని చ్చారు. బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి అధ్యక్షతన బుధవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో బాబూరావు మాట్లాడారు. ఇసుక అందుబాటులో లేక భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఇసుక విధానంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి తేడా లేదని విమర్శించారు. నేటి నుండి ఇసుక బుకింగ్‌ ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టినా ఆచరణలో పేదలకు ఇసుక అందట్లేదన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు తగ్గినా మన దేశంలో పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు తగ్గలేదని అన్నారు. క్రిమినల్‌ చట్టాలలో మార్పులు తెచ్చి ఉద్యమకారులు, ప్రతిపక్షాలపై నిర్భంధం ప్రయోగించేందుకు పూనుకుంటున్నారని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ వరదల్లో సర్వస్వం కోల్పోయిన రైతులకు, కౌలు రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని, వరికి రూ.25 వేలు, ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.లక్ష ఇవ్వాలని, పూర్తిగా మునిగిన ఇళ్లకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాడేపల్లి సుందరయ్య నగర్‌లో మహానాడు ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా మునిగిపోయిన వారికి ఇంటికి రూ.10 వేలే ఇవ్వడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాలను అమలు జరపాలని కోరారు. అర్హులైన పేదలందరికీ వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు ఇవ్వాలని, ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, రాజధాని అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి, ఇ.అప్పారావు, ఎన్‌.భావన్నారాయణ, యస్‌.యస్‌.చెంగయ్య, నాయకులు డి.వెంకటరెడ్డి, బి.వెంకటేశ్వరరావు, బి.కోటేశ్వరమ్మ, ఎం.ఎ.చిస్టీ పాల్గొన్నారు.

➡️