సిపిఎం మహిళానేత కామ్రేడ్ కుడుపూడి రాఘవమ్మ సేవలు చిరస్మరణీయం

Jan 9,2025 17:58 #Kakinada

ప్రజాశక్తి – కాకినాడ : ఉమ్మడి తూర్పుగోదావరి సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలిగా కుడుపూడి రాఘవమ్మ చేసిన సేవలు చిరస్మరణీయం అని సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు కొనియాడారు. గురువారం ఉదయం కాకినాడ సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ కుడుపూడి రాఘవమ్మ సంతాపసభ నిర్వహించారు.
సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా కరణం ప్రసాదరావు, జి. బేబిరాణి లు రాఘవమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ మహిళా సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల కార్యాచరణలో రాఘవమ్మ సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి. బేబిరాణి మాట్లాడుతూ రాఘవమ్మ ఉద్యమ నేపధ్యాన్ని వివరించారు. అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామం లో తన భర్త యుటిఎఫ్ నేత అయిన కుడుపూడి నర్సింహమూర్తి ప్రోత్సాహంతో ప్రజా ఉద్యమాలలో అడుగు పెట్టారని తెలిపారు. సారా వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రాఘవమ్మ మహిళా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. కాలినడకన గ్రామాలు తిరుగుతూ, రాత్రి పూట వ్యవసాయ కార్మికుల ఇళ్లలో బస చేస్తూ కూలి పెంపుదల ఉద్యమాల్లో సమరశీల పాత్ర నిర్వహించారని కొనియాడారు.
దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు గా, సిపిఎం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యురాలు గా రాఘవమ్మ సుధీర్ఘ కాలం ప్రజాసేవలో ఉన్నారని వారి స్ఫూర్తి తో నేటితరం ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కెఎస్ శ్రీనివాస్ తో పాటు కోనేటి రాజు, వల్లు రాజు బాబు, కుంచే మణి తదితరులు మాట్లాడుతూ రాఘవమ్మ తో వారి అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్. రాజ్ కుమార్, నగర కన్వీనర్ పలివెల వీరబాబు తో పాటు నగర కమిటీ సభ్యులు కె. సత్తిరాజు, మలక వెంకట రమణ రూరల్ కమిటీ సభ్యులు సిహెచ్.అజయ్ కుమార్, టి.రాజా, పి.రామకృష్ణ, చంద్రమళ్ళ పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, ఎం హరనాధ్, కె. వీరబాబు, కె. సింహాచలం, జి. భూలక్ష్మి , సంజయ్, విపిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

➡️