దివాళా తీయించి టిడిపి ప్రభుత్వంపై విమర్శలా?: కందుల

ప్రజాశక్తి-మార్కాపురం : ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల రాష్ట్రంగా మిగిల్చడమే కాకుండా ప్రస్తుత టిడిపి ప్రభుత్వంపై విమర్శలతో అభాం డాలు వేస్తున్న వైసిపి నేతలపై మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మండిపడ్డారు. మార్కాపురం పట్టణంలోని పదో వార్డులో శనివారం నాటి పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం కందుల మాట్లాడారు. అప్పుల ఊబిలోకి నెట్టింది గత వైసిపి ప్రభుత్వం మాత్రమే అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై బురద చల్లడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అన్ని విధాలా సర్వనాశనం చేశారన్నారు. గాడి తప్పిన వ్యవస్థను సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌లు పట్టాలెక్కిస్తున్నారన్నారు. మంత్రి నారా లోకేష్‌ ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన సంక్షేమ పింఛన్లు లబ్ధిదారుల ఇంటి వద్దనే ఇప్పిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకూ ఒకటో తేదీ జీతాలు బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తోందన్నారు. అధికారం కోల్పో యిన ఏడు నెలలకే వైసీపీ నాయకులు ఓర్వలేక తెలుగు దేశం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఆందోళనలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పింఛన్ల పంపిణీలో టిడిపి పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ డివిఎస్‌ నారాయణరావు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ నాలి కొండయ్య, టిడిపి నాయకులు మాలపాటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️