పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి : బి హెచ్ రాయుడు

Nov 27,2024 15:20 #anatapuram

 

గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాదిరే రైతులు వాటా లేకుండా ఈ ప్రభుత్వం కూడా అమలు చేయాలి
బి హెచ్ రాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి

ప్రజాశక్తి – రాయదుర్గం: రబీ పంటల బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, బీమా ప్రీమియం పేరుతో రైతులపై భారం వేయవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బిహెచ్ రాయుడు డిమాండ్ చేశారు. బుధవారం రాయదుర్గం పట్టణంలో రైతు సంఘం నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బి హెచ్ రాయుడు మాట్లాడుతూ.. రబీ పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వలన సన్న,చిన్న కారు రైతులు, పేద రైతులు,కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం అమలు చేసి, రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించిందని గుర్తు చేశారు. అదే తరహాలో బీమా ప్రీమియం ప్రస్తుత రబీ పంట కాలంలో కూడా ప్రీమియం చెల్లించాలని కోరుతున్నారని, రైతులు కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతుధరలు రాక నష్టపోతున్న ఈ తరుణంలో రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉందన్నారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు పంటల బీమా పథకం అప్పగించడం వలన బీమా ప్రీమియం పేరుతో కంపెనీలు లాభాలు గడిస్తున్నాయని, రైతులకు మాత్రం బీమా పరిహారాలు అందడం లేదన్నారు. అందుకు సమగ్ర పంటల బీమా పథకం తీసుకువచ్చి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీని నడిపి బీమా పరిహారాలు రైతులకు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అన్ని పంటలకు పంటల బీమా పథకం అమలు జరిగేలా, సమగ్ర పంటల బీమా పథకం తీసుకురావాలని, పెట్టుబడి పెట్టి నష్టపోతున్న కౌలు రైతులకే పంటల బీమా పరిహారాలు అందించాలనీ, పప్పుశనగ పంటకు 450 గ్రామం యూనిట్ గా తీసుకోవడం జరిగినదని. వరికి 315 మొక్కజొన్నకు 525 వేరుశెనగకు 480 గా పంటలకు మండల యూనిట్ గా తీసుకోవడం జరిగిందని ,టమోటా కు 1600 రూపాయలు వెదర్ బేస్ కి జిల్లా యూనిట్ గా తీసుకోవడం జరిగిందని. ఏఐసి ఆఫ్ ఇండియా వెదర్ బేసిగా
ఫీచర్ జనరల్ ఇన్సూరెన్స్ దిగుబడి బేసిగ్గా తీసుకొవడం జరిగినదని అనంతపురం జిల్లా పంటలకు ప్రకటించ బడిందని అన్నారు. కావున ఇవి వరి పంటకు డిసెంబర్ 31వ తేదీ చివరి తారీకు, మిగతా పంటలకు డిసెంబర్ 15వ తేదీ వరకు ప్రకటించడం వల్ల రైతులకు ఈ విధమైన ఇన్సూరెన్స్ పూర్తి నష్టదాయకమని ఆంధ్రప్రదేశ్ సంఘం రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నది. కావున ప్రభుత్వ స్పందించి పంటల బీమా ప్రీమియంను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి మల్లికార్జున, రైతు సంఘం నాయకులు కృష్ణ నాయక్, తిప్పేస్వామి, రమేష్, మధు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️