సాగుచేస్తున్న భూములకు పట్టాలివ్వాలి

Jun 8,2024 21:30

ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని కుడుమూరులో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు తక్షణమే పట్టాలి ఇచ్చి ఆదుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం, సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని, గిరిజనులను బెదిరింపులకు పాల్పడుతున్న విఆర్‌ఒ, ఇతర రెవెన్యూ అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం, సిపిఎం ఆధ్వర్యంలో కుడుమూరు భూములు వద్ద శనివారం గిరిజనులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు సూకూరు అప్పలస్వామి, జమ్మల గోపాలు, కొర్ర కళ్యాణ్‌ శ్రీను మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఏడాది పాటు అనేక పోరాటాల ఫలితంగా సర్వేలు చేసినా, నేటికీ పట్టాలు ఇవ్వలేదన్నారు. సర్వే వివరాలను కూడా బయట పెట్టడం లేదని, ఇందులో ఏదో మతలబు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యంగా కలిసి ఉన్న గిరిజనులను విడదీస్తూ ఈ భూములను కాజేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్వే చేసిన భూవివరాలను బయటపెట్టి ఎవరైతే సాగులో ఉన్నారో వారందరికీ హక్కులు కల్పించాలన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ గిరిజనులు పూర్వం నుంచి సాగు చేస్తున్న సర్వే నెంబరు 48లో ప్రభుత్వ భూముల్లో హక్కులు కల్పించకుండా రెవెన్యూ అధికారులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితి దుర్మార్గమని, ఇప్పటికైనా గ్రామసభల్లో వారు సాగు చేస్తున్న భూములకు హక్కులు కల్పించాలని, సర్వే చేసిన వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మండలంలోని ప్రజా సంఘాలు, ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. నిరసన కార్యక్రమంలో పలువురు గిరిజనులు పాల్గొన్నారు.

➡️