7వ తేదీ తర్వాత యడవల్లి భూముల్లో సాగు

Dec 1,2024 01:52

సమావేశంలో మాట్లాడుతున్న వి.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-చిలకలూరిపేట :
యడవల్లి దళితుల భూమి జోలికొస్తే సహించబోమని వ్యవసాయ కార్మి క సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక పండరిపురంలోని సిఐటియు కార్యాలయంలో యడవల్లి దళిత, గిరిజన భూపోరాట కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో యడవల్లి భూ బాధిత రైతుల సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి దళిత రైతు శామ్‌సన్‌ అధ్యక్షత వహించగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యడవల్లిలో ఎస్సీ, ఎస్టీలు దశాబ్ధాలుగా సాగు చేసుకుంటున్న భూములను వారి ఆమోదం లేకుండా, గ్రామసభలు నిర్వహించకుండా, మైనింగ్‌ కోసం బలవంతంగా గత వైసిపి ప్రభుత్వం లాక్కుందని అన్నారు. నష్టపరిహారం కూడా సరిగా ఇవ్వలేదని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సొసైటీ భూముల్లో క్వారియింగ్‌ను నిలిపేయాలన్నారు. సొసైటీ భూమి 416 ఎకరాలు సర్వే చేసి ప్రతి దళిత గిరిజన కుటుంబానికి వ్యక్తిగత పట్టాలు వెంటనే ఇవ్వకుంటే 7వ తేదీ తర్వాత ఆ భూములను సాగు చేస్తామని ప్రకటించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి విడుదల రజిని ఆ భూములో మైనింగ్‌కు కడప ఎంపీ అవినాష్‌రెడ్డితో కుమ్మక్కయ్యారని, దీనిపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించగా నష్టపరిహారంపై 2021లో కోర్టు వివరాలు అడిగినా అధికారులు ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఆరోజు భూములు లాక్కోవటానికి సహాయం చేసిన అప్పటి ఎస్‌ఐను కూడా సస్పెండ్‌ చేయాలని కోర్టు ఆదేశించిందన్నారు. అయినా గత ప్రభుత్వం గాని,ఈ ప్రభుత్వం కూడా పేదలకు న్యాయం చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా పల్నాడు కార్యదర్శి జి.రవిబాబు, కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ, సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు, ఎస్‌.లూథర్‌, బాధిత రైతులు పాల్గొన్నారు.

➡️