ముమ్మరంగా పసుపు సాగు

ప్రజాశక్తి -చాపాడు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూములు పదును కావడంతో రైతులు పూర్తిగా వ్యవసాయ పనుల్లో నిమగమయ్యారు. పసుపు సాగు ముమ్మరం చేశారు. కుందూ నదీ పరిధిలో రైతులు దుక్కిళ్ళు, వరి నారు సాగుకు ఏర్పాట్లు, కాలువలలో పూడికతీత, నారుమడి కయ్యల ఏర్పాటు వంటి పనులలో పూర్తిగా నిమగమయ్యారు. పంటపొలాలలో రైతులు పసుపు సాగు చేస్తూ కనిపిస్తున్నారు. జిల్లాలో గత వారంలో వర్షాలు పడటం, సాగుకు సమయం ఆసన్నం కావడంతో సాగు చేపడుతున్నారు. కుందూ పరిధిలో వరి పంట సాగు చేసేందుకు రైతులు నిమగమయ్యారు. మండల పరిధిలో గత ఏడాది 250 ఎకరాలలో పసుపు పంట సాగుఅయినది. ఈ ఏడాది సాగు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విత్తనపు ధర అత్యధికంగా పుట్టి (300) కిలోలు రూ.13 వేల వరకు ధర పలుకుతుంది. ఎకరాకు ఐదు పుట్ల వరకు రైతులు సాగుకు ఉపయోగిస్తున్నారు. విత్తనపు పసుపును గత ఏడాది సాగు చేసిన రైతులు నుండి సేకరిస్తున్నారు. మైదుకూరు మండలం కెసి లింగాయపల్లి బండివారిపల్లి, ఉత్సలవరం, గంజికుంట ప్రాంతాల నుండి కొనుగోలు చేసి తీసుకు వస్తున్నారు .ఎకర సాగుకు కూలీలు, విత్తనం ,కాడెద్దులు తో కలిపి రూ.60 వేల వరకు ఖర్చులు అవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. వర్షాలు తక్కువగా పడినప్పటికీ పసుపు సాగుకు అదును దాటుతుందని రైతులు ముమ్మరంగా సాగుచేస్తున్నారు. కెసి కాలువకు సకాలంలో నీరు విడుదల అయితే 18 వేల ఎకరాలలో వరి పంట సాగు జరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. చాపాడు, సీతారామాపురం, అల్లాడుపల్లె, కేతవరం, చియ్యపాడు తదితర గ్రామాలలో పసుపు సాగు చేపడుతున్నారు.

➡️