ప్రజాచైతన్య యాత్రలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేస్తున్న నాయకులు
ప్రజాశక్తి-సత్తెనపల్లి : పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహశీల్ధార్ కార్యాలయం వద్ద ఈ నెల 18న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల పిలుపునిచ్చారు. సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఫణిదం చేనేత సొసైటీ ఏరియాలో జరిగింది. విమల మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని ఎన్నికలప్పుడు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు రూ.18 వేల కోట్ల భారాలను ప్రజలపై మోపారని, నమ్మి ఓటేసిన ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. గతంలో రూ.వందల్లో వచ్చే విద్యుత్ బిల్లులు నేడు వేలల్లో వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు తగ్గిపోయి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పేదలతోపాటు సామాన్యులకూ కష్టాలు వచ్చి పడ్డాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం చేపట్టే ఆందోళనల్లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కె.శివదుర్గారావు, జి.యేసు, జి.శ్రీను, కె.రమాదేవి, జె.రాజ్ కుమార్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – క్రోసూరు : మండలంలోని ఎర్రబాలెం ఎస్సీ కాలనీలో శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాచైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను సిపిఎం బృందం దృష్టికి తెచ్చారు. 14 కుటుబాలకు చెందిన దళితలం తాతల కాలం నుండి సాగుచేస్తున్న భూములకు పట్టాలివ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఆన్లైన్ లేకపోవడం వల్ల సాగుకు అవసరరమైన పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సి వస్తోందని వాపోయారు. అనంతరం సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు మాట్లాడుతూ తాతల కాలం నాడు పట్టాలు పొందిన వారికి పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. మురుగు కాల్వలు సరిగా తీయకపోవడం వల్ల దోమలు పెరిగి ఇబ్బందులు పడుతున్నారని, లూథరన్ చర్చి వద్ద ఉన్న చేతి పంపుకి మరమ్మతులు చేయాలని అర్జీ పెట్టి 15 రోజులైనా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి టి.హనుమంతరావు, నాయకులు జి.జోజప్ప పాల్గొన్నారు.
