కరెంటు కోత.. ఉక్కపోత..

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ అసలే వేసవి కాలం..ఆపై కరెంట్‌ కోతలు.. రెండూ కలిపి ప్రజలకు ఉక్కపోత..ఇదీ జిల్లాలో దుస్థితి. మాడు పగిలే ఎండలతో ఉదయం 9 దాటితే బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్న ప్రజలు ఇంట్లోనే సేద తీరుదామన్నా కరెంటు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఉక్క పోతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలు ప్యానో, కూలరో వేసుకొని భానుడి తాపం నుంచి ఉపశమనం పొందాలనుకుంటే విద్యుత్‌ శాఖ అధికారులు అనధికార, అప్రకటిత విద్యుత్తు కోతలతో ప్రజలను విసుగెత్తిస్తున్నారు. మెయింటినెన్స్‌ డే అన్న పేరుతో వారాని కోసారి ఐదు నుంచి ఆరు గంటల పాటు విద్యుత్తు కోతలు విధిస్తూనే మరోవైపు ప్రతిరోజు అడ్డదిడ్డంగా విద్యుత్‌ సరఫరా నిలిపేస్తుండడంతో ప్రజలు ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి దాపురించింది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా విద్యుత్తు కోతలు విధిస్తూ సమాచారం కోసం విద్యుత్‌ శాఖ సిబ్బంది, అధికారులను చరవాణి ద్వారా సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పే నాధుడే లేడని ప్రజలు వాపోతున్నారు. ఓవైపు ఉక్క పోతలు, మరోవైపు కరెంటు కోతలతో చిన్నపిల్లలు, వద్ధులు వేసవి తాపానికి అల్లాడిపోతున్నారు. విద్యుత్‌ శాఖ అధికా రుల నిర్లక్ష్య వైఖరికి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ఇకనైనా అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తును అందించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. విద్యుత పంపిణీ సంస్థల నుంచి వినియోగానికి సరిపడా పంపిణీ కాకపోవడంతో అనధికారికంగా కోతలు పెడుతున్నట్లు తెలుస్తోంది.కోతలు లేకుండా సరఫరా చేయాలి పగలు, రాత్రి అన్న లేడా లేకుండా కరెంటు పోతోంది. ఉక్కపోత, వేడితో తీవ్రఇబ్బందులు పడ్డాం. వృద్ధులు, చిన్న పిల్లలు మరింత ఇబ్బందిపడ్డారు. ఎండాకాలాన్ని దష్టిలో ఉంచుకుని కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయాలి.- జి.గాయత్రి, గహిణి, విద్యుత్‌నగర్‌.మూడురోజుల నుంచి ఎక్కువగా తీసేస్తున్నారు ఎండలు పెరిగిపోయాయి. పగటి వేళల్లో ఇళ్లలో ఉండలేని పరిస్థితి. రాత్రి వేళల్లో వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. కరెంటు తీసేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా మరి ఎక్కువగా కరెంటు పోతోంది.- లక్ష్మిదేవి, గహిణి, రాజంపేట.పిల్లలు ఇబ్బంది పడుతున్నారు తరచూ విద్యుత్తు కోతలు విధిస్తుండడంతో ఉక్కపోతకు చిన్న పిల్లలు ఇంట్లో ఉండలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏ చెట్టు కిందనో సేదతీరుదామనుకున్నా ఎక్కడా చెట్టు జాడే కనబడటం లేదు. ప్రతి నెలా వెన్ను విరిచి కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు అంతరాయం లేని విద్యుత్తును అందించలేకపోతున్నారు.- కోడూరు నాగరాజ, ఊటుకూరు.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్తు అధికారులు విద్యుత్తు సమస్యలపై ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ విద్యుత్తు శాఖలో ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాం తాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలో సైతం కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎంత సేపు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యుత్తు శాఖలో ఉన్నత అధికా రుల నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు వినియోగదారుల పట్ల చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఆ శాఖలోని ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించే విధంగా చర్యలు చేపట్టాలి.-టి.హరికృష్ణ, డి.బి.ఎన్‌.పల్లె.

➡️