ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: అల్పపీడన ప్రభావంతో ఆదివారం సాయంత్రం నుంచి పడిన పిడుగుల వాన భీభత్సం సష్టించింది. దీంతో ప్రజలు, రైతాంగం తల్లడిల్లిపోయారు. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో మండలంలోని వివిధ గ్రామాల్లో చెట్లు విరిగి పడిపోయాయి. బ్యార్నిలపై రేకులు లేచిపోయాయి. గాలులకు విద్యుత్ తీగలు తెగి అర్ధరాత్రి వరకు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. నాగులప్పలపాడు, ఉప్పుగుండూరు, కనపర్తి తదితర గ్రామాల ధాన్యం రాశులు, మిర్చి కల్లాలలతో పాటు పొగాకు పందిర్లపై పట్టలు గాలులకు లేచి పోవడంతో తడిసి ముద్దయ్యాయి. ఎన్నో ఒడిదుడకులు ఎదుర్కొని ఆరుగాలం పండించిన పంటలు అకాలవర్షానికి తడవడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఏ పంట చూసినా దిగుబడులు బాగా తగ్గాయి. దాంతో ధరలు పతనం అవడంతో నష్టాలు తప్పలేదని రైతులు కంటనీరు పర్యంతమవుతున్నారు. పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. నల్లబర్లీ కొనేవాడు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లబర్లి పందిర్లపై ఉండటంతో పాటు దిగుబడి కూడా 8 క్వింటాలకు మించిరాలేదు. రేటు చూస్తే గతఏడాది కన్నా తక్కవగా ఉండటంతో పాటు ఈ అకాలవర్షం మరింత దెబ్బతీసిందని, తద్వార పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాన్యం మిర్చి తడవడంతో రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉప్పగుండూరులో పోస్టాపీసు బజారులో వేపచెట్టు విరిగి పడడంతో ఆసమయంలో ఎవరు లేక పోవడంతో ప్రమాదం తప్పింది.
