ప్రియుడితో కలిసి కన్నతండ్రిని కడతేర్చిన కూతురు

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : ప్రియుడితో కలిసి కన్నతండ్రిని కూతురు హత్య చేసిన ఘటన కోనసీమ జిల్లా మండపేటలో జరిగింది. మండపేట టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … మండపేట మేదరిపేటకు చెందిన సురా రాంబాబు కు వస్త్రాల వెంకట దుర్గ అనే కూతురుంది. ఆమె భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి స్థానికంగా నివసిస్తుంది. ఇదిలా వుండగా రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ముమ్మిడివరపు సురేష్‌ తో దుర్గ అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. కొన్నాళ్లకు ఈ విషయం తెలియడంతో భర్త ఆమె నుండి విడిపోయి అదే ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నాడు. దుర్గ తీరులో మార్పు రాకపోవడంతో తండ్రి రాంబాబు గట్టిగా మందలించాడు. దీంతో ఎలాగైనా తండ్రిని మట్టుబెట్టాలనుకుంది. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన కొత్తూరు లో ఉన్న ప్రియుడికి ఫోన్‌ చేసి వచ్చి తన తండ్రిని చంపేయాలని చెప్పింది. దీంతో ప్రియుడు సురేష్‌ తన స్నేహితుడు తాటికొండ నాగార్జున ను వెంటబెట్టుకుని వచ్చి, దుర్గ తండ్రి రాంబాబు కాళ్లను ఒకరు పట్టుకోగా, ఛాతీపై మరొకరు కూర్చుని పీక నులిమి చంపేశారు. అయితే మఅతుడు రాంబాబు సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మఅతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం రిపోర్టులో అది హత్యగా తేలింది. పోలీసులు చేపట్టిన విచారణ లో పక్కా ప్రణాళిక ప్రకారమే తండ్రిని చంపినట్లు దుర్గ అంగీకరించింది. నిందితులు ముగ్గురిని అరెస్ట్‌ చేసి గురువారం రామచంద్రపురం కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి రిమాండ్‌ విధించి నట్లు టౌన్‌ సీఐ సురేష్‌ తెలిపారు.

➡️