మంగళగిరి (గుంటూరు) : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 9 నెలల నిండు గర్భిణి మృతి చెందిందని…. మంగళగిరి ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు శనివారం ఆందోళన చేపట్టారు. మంగళగిరి రత్నాల చెరువులో నివసిస్తున్న మైల నిరీష్ 9 నెల నిండు గర్భిణి. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మైల నిరీష్ భర్త గోపికృష్ణ మాట్లాడుతూ… కాళీ గార్డెన్స్, నంబూరు మండలం, ఎస్‌ఎస్‌ఎస్ హెచ్‌కెవిపిబి ట్రస్ట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం తన భార్యను జాయిన్ చేశామని చెప్పారు. తల్లి బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని అంతా క్షేమంగానే ఉందని శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్ తమతో చెప్పారన్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తల్లి బిడ్డ ఇద్దరూ మృతి చెందారని చెప్పి… డెడ్ బాడీ తీసుకుని వెళ్లిపోవాలని ఆసుపత్రి సిబ్బంది తమతో చెప్పారని వివరించారు. రాత్రి అంతా బాగానే ఉందని చెప్పి ఇప్పుడు ఎలా చనిపోయిందని బంధువులు ప్రశ్నించగా… ఆసుపత్రి సిబ్బంది ఎలాంటి సమాధానం చెప్పలేదని రోదించారు. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు.
9 నెలల నిండు గర్భిణి మృతి : ఆసుపత్రి ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన
