పర్సన్ ఇన్ ఛార్జి సేతుమాధవన్
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా ఖాతాదారులకు గతంలో మంజూరు చేసిన వివిధ రకాల రుణాల రికవరీలను చేపట్టి నిరర్ధక ఆస్తులను తగ్గించాలని బ్యాంకు పర్సన్ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఆదేశించారు. బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్లు, సూపర్‌వైజర్లు రుణవసూళ్లకు సంబంధించి తమకు కేటాయించిన లక్ష్యాలను సాధించాలని స్పష్టంచేశారు. డిసిసిబి జనరల్ బాడీ సమావేశం బ్యాంకు పర్సన్ ఇన్ ఛార్జి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధ్యక్షతన గురువారం వర్చ్యువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా బోర్డు సమావేశం కూడా నిర్వహించారు. బ్యాంకులో వివిధ దశల్లో ఎలాంటి అవకతవకలకు తావులేని విధంగా నియంత్రణ వుండాలని జెసి స్పష్టంచేశారు. బ్యాంకు ఆర్ధిక కార్యకలాపాల నిర్వహణకు ఒక స్టాట్యుటరీ ఆడిటర్‌ను నియమించేందుకు అనుమతి కోసం రిజర్వుబ్యాంకును కోరేందుకు సమావేశంలో నిర్ణయించారు. జిల్లాలో ప్రస్తుతం 60 సంఘాల కంప్యూటరీకరణ కోసం ఆన్‌లైన్ ప్రక్రియ జరుగుతోందని సిఇఒ సిహెచ్.ఉమామహేశ్వరరావు తెలిపారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి పి.రమేష్, నబార్డు డిడిఎం టి.నాగార్జున తదితరులు పాల్గొన్నారు.