గ్రామస్తులతో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు
ప్రజాశక్తి – దుగ్గిరాల : దళితుల ఆర్థిక స్థితిగతులపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండలంలోని పెదపాలెంలో శనివారం సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను నాయకుల వద్ద ప్రస్తావించారు. ఉపాధి హామీ పనులు సరిగా చూపడం లేదని, కూలి సైతం ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.300 ఇవ్వడం లేదని అన్నారు. డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. కూలి పనులు సరిగా లేక అప్పులు చేసి బతుకుతున్నామని, డ్వాక్రాతోపాటు వారాల వారీగా అప్పులకు వడ్డీలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నామన్నారు. ప్రభుత్వ పథకం కింద పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సర్వేలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జె.బాలరాజు, నాయకులు కె.రాజేంద్రబాబు, జి.సుధీర్, టిఎల్‌సి రావు, ఎన్.జ్ఞానయ్య, కె.జార్జి పాల్గొన్నారు.