నడక వంతెనను కూల్చితే ప్రజా ఉద్యమం

Jun 12,2024 00:15 #cpm pressmeet
Gopalapatnam cpm pressmeet

ప్రజాశక్తి -గోపాలపట్నం : సింహాచలం రైల్వే స్టేషన్‌ నుంచి చంద్రనగర్‌ వెళ్లే నడక వంతెనను కూల్చితే ప్రజా ఉద్యమం తప్పదని సిపిఎం గోపాలపట్నం డివిజన్‌ కార్యదర్శి బలివాడ వెంకటరావు హెచ్చరించారు. గోపాలపట్నంలోని సిఐటియు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రనగర్‌ వెళ్లే నడక వంతెనను కూల్చేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నడకవంతెనను ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. ఇటీవల చంద్రనగర్‌ నుంచి బాజీ జంక్షన్‌ వెళ్లేందుకు రైల్వే ట్రాక్‌ మధ్యలో అండర్‌ పాత్‌ మార్గాన్ని రైల్వే శాఖ నిర్మించిందని, దీని వల్ల వాహన చోదకులకు ఉపయోగం తప్ప బాటసారులకు ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నడక వంతెనకు మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా నడక వంతెనను కూల్చితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఐద్వా గోపాలపట్నం డివిజన్‌ కార్యదర్శి ఎస్‌.విజయలక్ష్మి మాట్లాడుతూ, సుమారు 14 గ్రామ ప్రజలు రాకపోకలు సాగించే నడకవంతెనను ఎట్లా కూల్చుతారని ప్రశ్నించారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే గణబాబుకు వినతిపత్రం సమర్పించామని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ, ఒకసారి పరిశీలించి అధికారులతో మాట్లాడి సముచితమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆమె చెప్పారు. బుధవారం ఉదయం చంద్రనగర్‌ గ్రౌండ్‌లో ప్రజా ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.అనసూయ, పాలమ్మ, కాంతం తదితరులు పాల్గొన్నారు 

➡️