సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికుల గుడిసెలు కూల్చివేత

Dec 1,2024 01:51

ప్రజాశక్తి-తాడేపల్లి : సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ, పోలీస్‌ అధికారులు కలిసి శనివారం కూల్చివేశారు. కార్మికులందరూ దీక్ష శిబిరం నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత, వర్షం పడుతున్న సమయంలో సాయంత్రం సుమారు 5.30 గంటలు సమయంలో జెసిబిలతో పేదల గుడిసెలు నిమిషాల వ్యవధిలోనే నేలమట్టం చేశారు. కార్మికులకు విషయం తెలిసి వచ్చేలోపే ప్రభుత్వ అధికారులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఎమ్‌టిఎంసి కమిషనర్‌ ఆలింబాష, తాడేపల్లి తహశీల్దార్‌ సీతారామయ్య ఆదేశాలతో కూల్చివేతలు జరిగినట్లు కూల్చివేతకు వచ్చిన అధికారులు చెబుతున్నారు. మొన్నటిదాకా అది ప్రైవేటు స్థలమని, దాంతో తమకు సంబంధం లేదని చెప్పిన అధికారులు ఇప్పుడు కూల్చివేతలకు పాల్పడటం వెనుక ప్రభుత్వం హస్తం ఉందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు అనుకూలంగా కోర్టులు తీర్పులివ్వగా వీటి అమలును విస్మరించిన రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం చట్టాలను ఉల్లంఘించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. తాము లేని సమయం చూసి ప్రభుత్వం దొంగదెబ్బ తీసిందని కార్మికులు మండిపడుతున్నారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికుల విషయంలో మీకు న్యాయం చేస్తానని చెప్పిన మంత్రి నారా లోకేష్‌ ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్‌ చేచేస్తున్నారు. ప్రభుత్వం, మంత్రి కార్మికుల పక్షము, ఎన్నారైల పక్షమా? తేల్చుకోవాలన్నారు.
కార్మిక సంఘాలు ఖండన
తమకు న్యాయంగా రావాల్సిన సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులు తమకు సంబంధించిన స్థలంలో వేసుకున్న గుడిసెలను ప్రభుత్వ అధికారులు కూల్చివేయడాన్ని వైసిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి ఖండించారు. కార్మికుల పక్షాన తాము అండగా ఉంటామన్నారు. కూల్చివేతను సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు, ఐఎన్‌టియుసి నాయకులు దర్శనపు సామేలు, ఎఐఎఫ్‌టియు నాయకులు కోటేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు టి.వెంకటయ్య ఖండించారు. ప్రభుత్వం అధికారులు ఎన్‌ఆర్‌ఐలకు అండగా ఉండటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఈ సమస్యపై స్పందించాలని కోరారు.

➡️