డిపాజిటర్ల నగదు గోల్‌మాల్‌

Oct 4,2024 00:24

బ్యాంకులో ఆందోళనకు దిగిన డిపాజిటర్లు
ప్రజాశక్తి-చిలకలూరిపేట :
వృద్ధాప్యంలో ఆర్థిక బద్రత కోసం కొంతమంది, పిల్లల చదువులు, పెళ్లిళ్లకని మరి కొంతమంది.. దాచుకున్న డబ్బు, బంగారం గోల్‌మాల్‌ అయ్యింది. తమ డిపాజిట్లకు జమవ్వాల్సిన వడ్డీ గతనెల జమకాకపోవడంతో ఖాతాదార్లు ఒక్కొక్కరుగా గురువారం మధ్యాహ్నం నుండి బ్యాంకుకు రావడం మొదలుపెట్టారు. తీరా విషయం తెలుసుకుని ఆందోళనకు దిగారు. వివరాల ప్రకారం..పట్టణంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఐసిఐసి బ్యాంకులో కొందరు ఫిక్స్డ్‌ డిపాజిట్లు చేసుకున్నట్లు ఖాతాదారులు చెబుతున్నారు. వడ్డీ జమకాకపోవడంపై వీరు వివరణ కోరగా ఇప్పటి వరకు ఆ వడ్డీ తమ బ్యాంకు నుండి డిపాజిట్‌ కాలేదని, వేర్వేరు ప్రైవేటు ఖాతాల నుండి జమైందని సిబ్బంది వివరించారు. దీంతో తాము మోసపోయామని తెలిసి అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆశ్రయించారు. మరోవైపు డిపాజిట్లకు సంబంధించి ధ్రువపత్రాలు తేవాలని ఖాతాదార్లను బ్యాంకు సిబ్బంది కోరగా వారు తెచ్చి చూపడంతో అవి తమ రికార్డుల్లో నమోదు కాలేదని చెప్పటంతో విస్తుపోయారు. బంగారం తనఖా విషయంలోనూ గోల్‌మాల్‌ జరిగిందని తెలుస్తోంది. గతంలో బ్యాంకులో పనిచేసిన మేనేజర్‌, సిబ్బంది ఇందుకు కారణమని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై నరసరావపేట డీఎస్సీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు బ్యాంకు జోనల్‌ మేనేజర్‌ సందిప్‌ మెహరా బ్రాంచికి చేరుకొని విచారణ చేస్తున్నారు. 70 మంది వరకూ బాధితులున్నారని తెలుస్తుండగా తమ వద్దకు 15 మంది వచ్చారని డీఎస్పీ తెలిపారు. వీరు దాదాపు రూ.6.5 కోట్ల వరకూ డిపాజిట్‌ చేసినట్లు ప్రాథమికంగా తేలిందని చెప్పారు. బాధితుల ఆవేదన.. పొలం అమ్మగా వచ్చిన రూ.2.85 కోట్లను మూడేళ్ల క్రితం డిపాజిట్‌ చేశానని, ప్రతినెలా వడ్డీ జమవుతుండగా గత నెల జమ కాలేదని, ఏమిటా అని ఆరా తీస్తే ఇలా జరిగిందని 68 ఏళ్ల లలితాదేవి వాపోయారు. తాను రూ.40 లక్షలు ఫిక్స్డ్‌ డిపాజిట్‌ చేశానని జి.లకీëదేవి చెప్పారు. రూ.30 లక్షలు వేసినట్లు బి.చంద్రశేఖర్‌, రూ.21.94 లక్షలు వేశానని 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి షేక్‌ బాజి తెలిపారు. బంగారాన్ని తనఖా పెట్టి రూ.30 లక్షలు రుణం తీసుకుని దానితోపాటు మరో రూ.30 లక్షలు కలిపి రూ.60 లక్షలను డిపాజిట్‌ చేశానని షేక్‌ సుభాని వాపోయడు. ఈ మొత్తం కుంబకోణంలో బ్యాంక్‌ మేనేజర్‌, మరో ఉద్యోగి ముఖ్యకారకులని డిపాజిటర్లు అనుమానిస్తున్నారు.

➡️