భూములను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్‌

ప్రజాశక్తి-పొదిలి: మర్రిపూడి మండలంలోని ఫ్రీ హోల్డ్‌ భూములను జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు మంగళవారం భూములను పరిశీలించినట్లు డిప్యూటీ కలెక్టర్‌, ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌ ఎంవిఎస్‌ లోకేశ్వర రావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఫ్రీ హోల్డ్‌ భూముల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మర్రిపూడి తహశీల్దార్‌ కార్యాలయంలో తిప్పలదేవుపల్లి, సన్నమూరు గ్రామాల రెవెన్యూ రికార్డులను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకునే ప్రక్రియ గతంలోనే ప్రారంభమైందని ఆ ఫ్రీ హోల్డ్‌ భూములను వారి వారి అవసరాల నిమిత్తం అమ్ముకున్నట్లు రిజిస్ట్రేషన్‌ ద్వారా తెలిసింది. అమ్మిన రైతులు, కొనుగోలు చేసిన రైతులను విచారించి ఆయా భూములకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకునేందుకు ఈరోజు వచ్చినట్లు తెలిపారు. మండలంలో 102:35 సెంట్లు భూములు ఫ్రీ హోల్డ్‌ కింద ఆయా గ్రామాల రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని తెలిపారు. సన్నమూరు, తిప్పలదేవుపల్లి గ్రామాల్లోని భూములను విక్రయాలు జరిపిన రైతులను విచారించారు. జిల్లాలో పెద్దారవీడు, మర్రిపూడి మండలాలకు విచారణ అధికారిగా నియమించినట్లు డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు తెలిపారు. ఆయన వెంట మర్రిపూడి తహశీల్దార్‌ జ్వాలా నరసింహారావు, సర్వేయర్లు తదితరులు ఉన్నారు.

➡️