ప్రజాశక్తి – దాచేపల్లి : మండలంలోని పొందుగల రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీనివాసపురం గేటు వద్ద మంగళవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నడికుడి రైల్వే జంక్షన్ నుండి సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని రాసి సిమెంట్ కర్మాగారంలో సిమెంటు లోడ్ కోసం నడికుడి నుండి బయలుదేరిన గూడ్స్ రైలు మార్గమధ్యంలో పొందుగల రైల్వేస్టేషన్లో క్రాసింగ్ రావటంతో వేరే లైనుపై ఆగింది. ఆ రైలు వెళ్లిన తరువాత బయలుదేరిన రైలు మెయిన్ ట్రాక్ ఎక్కే సమయంలో పట్టాలు తప్పి నిలిచిపోయింది. ఇది గమనించిన లోకోపైలెట్ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టాలు తప్పిన భోగిని పక్కకు తప్పించారు. రైల్వే ట్రాక్ పనులను పూర్తి చేసి మెయిన్ లైనుకు గ్రీన్ సిగల్ ఇచ్చారు. ఆ సమయంలో తిరుపతి నుండి నడికుడి మీదుగా సికింద్రాబాద్ జంక్షన్‌కు వెళ్లాల్సిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ను తెనాలి నుండి విజయవాడ మీదుగా హైదరాబాదుకు మరలించారు. అనంతరం హైదరాబాదు నుంచి వచ్చే నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, డెల్టా పాసింజర్ రైలును ఆలస్యంగా మిర్యాలగూడ నుండి నడికుడి మీదుగా మళ్లించారు. అనంతరం ఇతర రైళ్లు యథావిధిగా నడిచాయి. ఘటనా స్థళిని డిఆర్‌ఎ రామకృష్ణ పరిశీలించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/dcpl-1.jpg)