మైనింగ్‌ పేరుతో కొండలు, పర్యావరణం ధ్వంసం ఆపాలి : సిపిఎం

విశాఖ :   క్వార్ట్‌ జైట్‌ గనులు వెలికితీత పేరుతో కొండలను, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు డిమాండ్‌ చేశారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం కుసులవాడ పంచాయతీలోని ఇచ్చాపురం గిరిజన గ్రామం దెయ్యాల మెట్ట కొండలను సిపిఎం భీమిలి జోన్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, గ్రామ ప్రజలతో కలిసి దెయ్యాలమెట్ట కొండను, ప్రజల వ్యవసాయ భూములను, పంట తోటలను గురువారం పరిశీలించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ క్వార్ట్‌ జైట్‌ గనుల నిక్షేపాలు వెలికితీతకు రాష్ట్ర ప్రభుత్వం అగ్నిసముఖ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అను సంస్థకు 15 ఎకరాలు కొండ భూములను 20 సంవత్సరముల లీజుకు కట్టబెట్టేందుకు సిద్ధపడుతోందని, ప్రభుత్వం ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కొండ పరిసర భూముల్లో గిరిజన ప్రజలు వరి, కొబ్బరి, మామిడి ,జీడి మామిడి ,అరటి, మునగ తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మైనింగ్‌ వల్ల వ్యవసాయం, పంటలు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ ప్రాంత ప్రజల ఉనికికి ,జీవనోపాధికి ప్రమాదం ఏర్పడుతుంది.పశుసంపదకు, వన్యప్రాణులకు హాని జరుగుతుంది. త్రాగునీరు, భూగర్భజలాలు,వ్యవసాయనీరు, గాలి కలుషితం అవుతాయి. ప్రజలు రోగాల బారిన పడతారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మైనింగ్‌ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రజలను, పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రభుత్వమే దీనికి విరుద్ధంగా అనుమతులు ఇవ్వడానికి పూనుకోవడం క్షంతవ్యం కాదు. గతంలో ఇదే మండలం కుసులవాడ పంచాయతీ చిన్నయ్య పాలెం గ్రామ పరిధిలో మైనింగ్‌ కు ప్రభుత్వం పూనుకుంటే ప్రజలు తిరస్కరించారు. అయినా ప్రభుత్వం తన ప్రయత్నాలను విరమించకుండా ఈసారి ఇచ్చాపురం గిరిజన గ్రామ కొండలను మైనింగ్‌ కు ఎంచుకోవడం దుర్మార్గమని అన్నారు. కొండలను, పర్యావరణాన్ని కాపాడుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి గెలిచిన టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు హామీలు మరిచి కొండలు మైనింగ్‌ కు అనుమతులు ఇవ్వడం ప్రజలను వంచించడమేనని అన్నారు.

సిపిఎం భీమిలి జోన్‌ కార్యదర్శి ఆర్‌ ఎస్‌ ఎన్‌ మూర్తి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ,పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్‌ వెంటనే జోక్యం చేసుకొని మైనింగ్‌ అనుమతులను రద్దు చేయించాలని, తమను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల పక్షాన నిలవాలని డిమాండ్‌ చేశారు. దెయ్యాల మెట్ట కొండ, ఇతర కొండలు ,పర్యావరణ ధ్వంసాన్ని ఈ ప్రాంతాల ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ అనుమతులు రద్దు చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అనంతపురం మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ప్రజలను ,కొండలను, పర్యావరణాన్ని కాపాడుటకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం మైనింగ్‌ అనుమతులు రద్దు చేయకుంటే ప్రజాందోళన చేయక తప్పదని హెచ్చరించారు.

➡️