ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : ఆలమూరు మండలంలోని నర్సిపూడిలో తూర్పు వీధి రామాలయం దగ్గర ఉన్న కీర్తిశేషులు ఉండమట్ల జానకి రామయ్య విగ్రహన్ని గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు గోనుసంచులతో పాటుగా టైర్లు వేసి నిప్పు పెట్టారు. దీంతో శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రామాలయం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గని నిరసన తెలిపారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వెంటనే వారిని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు ఎస్సై ఎం.అశోక్ సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన పరిస్థితులను సమీక్షించారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, దుశ్చర్యకు పాల్పడిన దోషులను గుర్తించి అరెస్ట్ చేస్తానని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావఅతం కాకుండా చూస్తానని శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి వారికైనా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. అనంతరం స్థానికులు పోలీసుల సమక్షంలో విగ్రహాన్ని శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.అశోక్ తెలిపారు.
