చలో విజయవాడకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
ఎక్కడికక్కడ హౌస్‌అరెస్టులు
ప్రభుత్వ తీరుపై సిఐటియు ఆగ్రహం
ప్రజాశక్తి-కొమరాడ, సాలూరు : తమ సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమానికి సిద్ధమైన అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడింది. అంగన్వాడీల ఉద్యమాన్ని అణచివేత చర్యలకు ఒడిగట్టింది. ఎక్కడికక్కడ అంగన్వాడీలను పోలీసులతో అడ్డుకుని, హౌస్ అరెస్టులకు పాల్పడుతూ పోరాటాన్ని నీరుగార్చేందుకు కక్ష పూరిత చర్యలకు దిగింది. ప్రభుత్వ తీరుపై సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల నిర్బంధాలను ఎదిరించి వేర్వేరు మార్గాల్లో అంగన్వాడీలు విజయవాడ పయనమయ్యారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు మూడు నెలల పాటు ఇవ్వాలని, తదితర డిమాండ్లపై గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన 42 రోజులపాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే. అంగన్వాడీల సమ్మె సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, లోకేష్.. తాము అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు గడుస్తున్నా అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. కాలయాపన చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్… సోమవారం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి అంగన్వాడీ కార్యకర్తలు భారీగా బయల్దేరారు. ఈ తరుణంలో ప్రభుత్వం అణచివేత చర్యలకు, నిర్బంధాలకు పాల్పడింది. విజయవాడ రైల్లో వెళ్లేందుకు గుమడ రైల్వేస్టేషన్‌కు వెళ్తున్న అంగన్వాడీ యూనియన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనురాధ, అంగన్వాడీలు మంగమ్మ, విజయలక్ష్మి, అనురాధ, గంగమ్మ, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తిని మార్గం మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. గుమడ రైల్వేస్టేషన్‌లో అంగన్వాడీ కార్యకర్తలు పద్మ, భవానిని పోలీసులు నిర్బంధించారు. అంగన్వాడీలపై పోలీసుల నిర్బంధాన్ని సిఐటియు జిల్లా నాయకులు కె.సాంబమూర్తి ఖండించారు.
సీతానగరం మండలం నిడగల్లులో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి.జ్యోతిలక్ష్మిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. మక్కువలో అంగన్వాడీ యూనియన్ నాయకులు దాలమ్మను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.అంగన్వాడీలపై నిర్బంధం దారుణం తమ సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం నిర్బంధానికి పాల్పడటం దారుణమని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు, జిల్లా నాయకులు కె.ఈశ్వరరావు మండిపడ్డారు.
పాచిపెంటలో వారు విలేకరులతో మాట్లాడారు. ఐసిడిఎస్ పిఒలు, పీడీల ద్వారా బెదిరింపులకు దిగడం, పోలీస్ యంత్రాంగాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సమాజంలో బెదిరించి ఎంతకాలం ఎవరినీ అణచివేసి ఉంచలేమని స్పష్టంచేశారు. అణచివేసిన పాలకవర్గాలు ఏమయ్యాయో టిడిపి కూటమి ప్రభుత్వం గుర్తుతెచ్చుకోవాలని హితవుపలికారు. 42 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్‌చేశారు. అణచివేత చర్యలను విరమించుకుంటే భవిష్యత్తులో అంగన్వాడీలకు అండగా అన్ని సంఘాలను కూడగట్టి పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గౌరీశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.