అభివృద్ధి ఎండమావి

Apr 3,2024 21:46

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భవించి నేటికి సరిగ్గా రెండేళ్లు కావచ్చింది. సొంత జిల్లా కావాలన్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరినా సమస్యలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. అభివృద్ధి జాడ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగానే ఉంది. శాఖల వారీగా భవనాలు, గదులు, కొన్నింటికి ప్రత్యేక భవనాలు ఏర్పాటైనా 90శాతం సిబ్బంది మొదలుకుని, జిల్లా స్థాయి అధికారుల వరకు స్థానికంగా నివాసం ఉండడం లేదు. ఉమ్మడి జిల్లాతో పోలిస్తే కలెక్టరేట్‌ ఇతర జిల్లా శాఖ అధికారులను కలిసేందుకు దూర భారం, ఆర్థిక ప్రయాస తగ్గింది. ఏడాదిలో సాధించిన ప్రగతి అదే. ముఖ్యంగా గిరిజనులకు వ్యయ, ప్రయాస తప్పడం లేదు. ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ కనిపించడం లేదు. ఎన్నో వనరులు ఉన్నా వాటిని వినియోగించి, జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందించడం, ఆ దిశగా కనీసం ప్రయత్నం చేయడం వంటి ఆనవాళ్లు కనిపించడం లేదు. ఎప్పటి మాదిరిగానే సంక్షేమ పథకాల హడావుడి తప్ప చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి పార్వతీపురం మన్యం జిల్లాగా 2022 ఏప్రిల్‌ 4న ఆవిర్భవించిన విషయం విదితమే. ఇందులో మొత్తం 15 మండలాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతమంతా విజయనగరం జిల్లా 1979లో ఏర్పడక పూర్వం శ్రీకాకుళం జిల్లాలోదే. అభివృద్ధికి దూరంగా ఉండడం, పరిపాలన సౌలభ్యానికి దూరభారం కావడం వల్ల కొత్తగా విజయనగరం జిల్లా ఏర్పాటు చేసి అందులో కలిపారు. అపారమైన వనరులు ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో, చాలా కాలం క్రితమే పార్వతీపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. వైసిపి వచ్చాక జిల్లాల పునర్విభజన చేయడంతో ఆ కల నెరవేరింది. జిల్లా అయితే ఏర్పడింది గానీ ప్రజలు, అభ్యుదయ, అభివృద్ధి కాముకులు ఆశించిన ఆశలు మాత్రం నెరవేరే పరిస్థితులు కనిపించ లేదు. జిల్లా ఆవిర్భావం సందర్భంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యమన్న పాలకులు గానీ, ఉన్నతాధికారులు గానీ అందుకనుగుణంగా కృషి చేయడం లేదు. రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లామన్యం జిల్లా మొత్తం జనాభా 9.72 లక్షలు. అందులో ఎస్‌సి జనాభా 1.15 లక్షలు (11.83శాతం), ఎస్‌టి జనాభా 2.65 లక్షలు (27.26శాతం) రెండూ కలిపితే 3,81,418 (39.09శాతం) అవుతుంది. రాష్ట్రంలో అల్లూరి జిల్లా తరువాత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా ఇదే. జిల్లాలో భూ విస్తీర్ణం 3,93,514 హెక్టార్లు కాగా సాగుకు అనువైన భూమి 1,67,961 హెక్టార్లు మాత్రమే. మిగిలినదంతా కొండలు, గుట్టలే. ఇప్పటికీ గిరిజనులు పోడు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పారిశ్రామికంగా వెనుకబాటు జిల్లాలో ఉన్న పరిశ్రమలు రెండే రెండు. అవి.. లచ్చయ్యపేట ఎన్‌సిఎస్‌ చక్కెర ఫ్యాక్టరీ, జీగిరాం జ్యూట్‌ మిల్లు. ప్రస్తుతం సుగర్‌ ఫ్యాక్టరీ మూతబడింది. ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములను ప్రభుత్వమే కారు చౌకగా విక్రయించి రియల్‌ ఎస్టేట్‌గా మార్చేసింది. జూట్‌ మిల్లు ఒడిదొడుకుల మధ్య ఉంది. కొత్తగా పరిశ్రమలు స్థాపించడం మాట అటుంచి ఉన్నవి కూడా మూతపడడంతో ఉపాధి, ఉద్యోగాలు స్థానికంగా దొరకడం లేదు. గిరిజనోత్పత్తులకు గిట్టుబాటు ధరేది? గిరిజన ప్రాంతం జీడి, పైనాపిల్‌, చింత పండు, తునికాకు తదితర అటవీ ఉత్పత్తులకు ఆలవాలం. స్థానికంగా ఫుడ్‌ పార్కులు ఏర్పాటు చేసి, గిరిజన ఉత్పత్తులకు గిరాకి పెంచుతామని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపరుస్తామని జిల్లా ఆవిర్భావ సమయంలో అధికార యంత్రాంగం ప్రగల్భాలు పలికింది. ఆచరణలో కనీస ప్రయత్నం లేదు. దీంతో, గిరిజనులు ఓవైపు దోపిడీకి గురౌతున్నారు. మరోవైపు అత్యల్ప ఆదాయంతో మెరుగైన జీవనం సాగించలేని దుస్థితి కొనసాగుతోంది. సాగునీటికి వెతలుమైదాన ప్రాంతంలో సారవంతమైన పంట భూములు ఉన్నాయి. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మన్యంలో వర్షపాతం ఎక్కువ. కానీ, నిల్వ చేసుకునే ప్రాజెక్టులు లేనందున వర్షం నీరు ఉపయోగ పడడం లేదు. నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజి నిర్మించినా జిల్లాకు ఉపయోగం తక్కువ. 1978లో ప్రారంభించిన జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. దశాబ్దం దాటినా అడారుగెడ్డపై చిరు ప్రాజెక్టు సైతం పూర్తి చేయలేదు. ఎక్కడికక్కడ కొండల్లో మినీ రిజర్వాయర్లు నిర్మించడం ద్వారా జిల్లా సస్యశ్యామలం చేయవచ్చు. ఎన్నో చోట్ల మినీ రిజర్వాయర్లు తక్కువ ఖర్చుతో నిర్మించే అవకాశం ఉన్నా ఈ ఏడాదిలో అటువంటి ప్రయత్నం ఈ రెండేళ్లలో కనీసం చేయలేదు.అభివృద్ధిపై న జిల్లా అభివృద్ధిపై ఎప్పటి మాదిరిగానే నిర్లక్ష్యం కొనసాగింది. రాష్ట్రంలో ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామంటూ చెప్పుకుంటున్న పాలకులు మన్యం జిల్లాకు మాత్రం ముఖం చాటేశారు. పార్వతీపురంలోని ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మాత్రమే మార్చారు. కురుపాంలోని ప్రభుత్వం ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఎంఎ, ఎం.కామ్‌, ఎంఎస్సీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ వంటి పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులు జిల్లాలో లేవు. గిరిజన యూనివర్శిటీ నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వలేదు. జిల్లా, రాష్ట్రానికి చెందిన పాలకులు ప్రశ్నించడం లేదు. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో చాలా గ్రామాలకు రోడ్లు లేవు. వైద్య సేవల కోసం డోలి మోత తప్పడం లేదు. రక్షిత తాగునీటి పథకాలు లేక చెలమనీరే గత్యంతరంగా ఉన్న గిరిజన గూడలెన్నో. బడిలేని గ్రామాలూ అనేకం ఉన్నాయి. గడిచిన ఏడాదిలో ఇవేవీ అధికార యంత్రాంగానికి పెద్దగా పట్టలేదు. కేవలం నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకే పరిమితమైంది. ఇవి కూడా అందని అర్హులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా జిల్లాను వ్యవసాయ, పారిశ్రామిక, సేవా, పర్యాటక రంగాల్లో అభివృద్ధి సమగ్ర ప్రణాళిక రూపొందించి, నిర్దిష్టమైన కాలపరిమితిలో అభివృద్ధి సాధించేందుకు కృషిచేయాలని జిల్లా ప్రజానీకం కోరుతున్నారు.

➡️