ప్రజాశక్తి – కొమరాడ : రాష్ట్రం గత ప్రభుత్వంలో 30 ఏళ్లు వెనుకబాటుకు గురైందని, కుటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తుందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. మండలంలోని వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపనలు, గోసాలు ప్రారంభోత్సవాలు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా మండలంలోని చోళ ్లపదం, గుమడ, దేవుకోన, పాలెం గ్రామాల్లో రూ.15 లక్షలతో 400 మీటర్ల చేపట్టిన సిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం పూడేసు పంచాయతీ లంజ నుండి గూనకల్లు వరకు గల 2 కిలోమీటర్ల రహదారి రూ.1.కోటీ 80 లక్షలతో పనులకు శంకుస్థాపన చేశారు. పూడేసులో ఉపాధిహామీ నిధులతో మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.20లక్షలతో చేపట్టిన 16 గోశాలలు ప్రారంభించారు. అనంతరం పార్వతీపురం నుండి కూనేరు అంతరరాష్ట్ర రహదారి పనులను పరిశీలించారు. కూనేరు, చోళ్లపదం, ఇందిరా నగరం వద్ద గోతులు పరిశీలించి, రహదారులు, భవనాలు శాఖ ఇఇ తో మాట్లాడి సత్వరం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ముఖ్యంగా ప్రజలకు అవసరాలైన రహదారి, మంచినీరు, విద్య, వైద్యం వంటి సదుపాయాలను ప్రతి ఒక్కరికీ కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు లేకపోవడంతో గిరిజనులు వైద్యం కోసం డోలిమోతలతో రావాల్సిన దయనీయ పరిస్థితి కూటమి ప్రభుత్వం స్వస్తి చెబుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందజేస్తూ దేశంలోనే అభివద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ మల్లికార్జునరావు, పంచాయతీరాజ్ డిఇ, ఎఒ శంకర్రావు, మండల ఇంజనీరింగ్ అధికారి కుమార్, మండల టిడిపి అధ్యక్షులు ఎస్.శేఖర్‌పాత్రుడు, నాయకులు దేవ కోటి వెంకట నాయుడు, మధుసూదనరావు, సుదర్శనరావు, పి.వెంకట నాయుడు, కృష్ణబాబు, జనసేన నాయకులు కట్రక మల్లేష్, కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలోని శివ్వాంలో పల్లె పండగలో భాగంగా శుక్రవారం రూ.3లక్షలతో నిర్మించిన ప్రధాన రహదారి నుండి నాగావళి నదికి వెళ్లే రహదారికి ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. అలాగే ఉపాధి హామీ నిధులతో రైతులు నిర్మించుకున్న గోసాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ రహదారుల అభివద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రానున్న రోజుల్లో గ్రామీణాభివద్ధికి పెద్దపీట వేస్తూ నియోజకవర్గాన్ని అభివద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కషి చేస్తానని తెలిపారు , నియోజకవర్గాన్ని అభివద్ధి చేయడానికి తనతో పాటు నాయకులు ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు అక్కేన మధుసూదన్ రావు, నాయకులు, ఎం పురుషోత్తమ నాయుడు, ఎం.తవిటినాయుడు, అంబటి రాంబాబు, పెద్దింటి పూర్ణచంద్ర, పల్లా పాపి నాయుడు తదితరులు పాల్గొన్నారు.