ప్రజాశక్తి-పెందుర్తి : ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలుచేయాలని డిమాండ్‌చేస్తూ 97వ వార్డు పరిధి చిన ముసిడివాడలో సిఐటియు ఆధ్వర్యాన ఆదివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కూడా ఇసుక ఇవ్వకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా ఇసుకను అందుబాటులో తేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప భవన నిర్మాణ కార్మికులు కష్టాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సిఐటియు జోన్ ప్రధాన కార్యదర్శి శంకరరావు మాట్లాడుతూ, గతంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులు ఉండటం వల్ల ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ అయ్యేదని తెలిపారు. ఇప్పుడు అసలు లాభం డిపార్ట్‌మెంట్ ఉందా.. లేదా.. అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో కార్మికులందరూ రోడ్డెక్కి భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పలనాయుడు, ఈశ్వరరావు, ప్రభుదేవా, మహేష్ రాజు, పూర్ణ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి, అధిక సంఖ్యలో భవననిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.