ప్రజాశక్తి-దత్తిరాజేరు : బకాయి జీతాలు చెల్లించాలని, గత ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద గ్రీన్ అంబాసిడర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు నెలల తరబడి జీతాలు బకాయిలు ఉంచడం సరికాదన్నారు. మండలంలో మూడు నుంచి 19 నెలల వరకు జీతాలు చెల్లించాల్సి ఉందని, ఇన్ని నెలలు బకాయి జీతాలతో ఎవరైనా పని చేస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాగైతే వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారని నిలదీశారు. ఇప్పటికైనా బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన జిఒ 680 ప్రకారం రూ.10 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. అనంతరం ఎంపిడిఒ విజయప్రసాద్‌కు వినతి అందించారు. కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్ల సంఘం మండల కార్యదర్శి కె.నూకరాజు, మూర్తి, కృష్ణ, అప్పారావు, రామారావు పాల్గొన్నారు.
