ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమస్యలు పరిష్కరించా లని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం కార్మికులు ధర్నా చేశారు. ఈసందర్భంగా .యూనియన్ కార్యదర్శి ఎ.జగన్మోహన్‌రావు, శ్రామిక మహిళా కన్వీనర్ జి. కుమారి, నాయకులు ఆదినారాయణ ,పైడిరాజు, కృష్ణ మాట్లాడారు. పారిశుధ్య కార్మికులకు 3 నెలల హెల్త్ అలవెన్స్, సరెండర్ లీవులు, డిఎ బకాయిలు, ఇంజనీరింగ్, ఇతర నాన్ పిహెచ్ కార్మికులకు సంక్రాంతి కానుక రూ.1000 ు, విలీన ప్రాంత కార్మికులకు ఇఎస్‌ఐ పిఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంపు హౌస్, పార్కులు ప్లాంటేషన్ , స్ట్రీట్ లైట్స్ తదితర విభాగాల్లో థర్డ్ పార్టీ కార్మికులకు 3 నుంచి 4 నెలల బకాయి జీతాలు టెండర్ ప్రకారం ఎరియర్స్‌తో సహా చెల్లించాలని, ప్రతి నెలా 10వ తేదీకి జీతాలు ఇవ్వాలని, డిమాండ్ చేశారు. అనంతరం మేయర్ విజయలక్ష్మికి వినతి అందజేశారు. వెంటనే ఆమె ఎంహెచ్‌ఒను పిలిచి మాట్లాడారు. పనిముట్ల సమస్యను వెంటనే పరిష్కరిస్తామని, రక్షణ పరికరాలకు టెండర్ పెట్టామని, పని వేళల మార్పుకు సంబంధించి కమిషనర్ తో మాట్లాడుతానని, మట్టి ఖర్చులు సిఎఫ్ ఎంఎస్ నుంచి కాకుండా జనరల్ పండ్ నుంచి వెంటనే చెల్లిస్తామని, రిటైర్మెంట్ వయసు సంబంధించి పరిశీలిస్తామని, ఇఎస్‌ఐ, పిఎఫ్ సమస్యల పరిష్కారానికి సానిటరీ ఇన్‌స్పెక్టర్లు ద్వారా సమాచారాన్ని సేకరించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాయకులు స్పందిస్తూ నవంబర్ 16 లోపు పరిష్కరించకపోతే దశల వారి పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సూరి, రమా, రామరాజు, ఈశ్వరమ్మ, ధనుంజయ, లక్ష్మణ్, రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
