ఐదో రోజు కొనసాగుతున్న సత్యసాయి కార్మికుల ధర్నా

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : సత్యసాయి కార్మికులకు పెండింగ్‌ లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలని పప్పురు పంప్‌ హౌస్‌ వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం 5 వ రోజు కొనసాగుతుంది. పంప్‌ హౌస్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ … సత్యసాయిబాబా కరువు జిల్లా ప్రజల దాహార్తి తీర్చడానికి ఏర్పాటు చేసిన పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. 25 ఏండ్ల నుండి నడుస్తున్న ప్రాజెక్ట్‌కు గ్రామాలు పెరుగుతున్నాయి, మరమ్మతులు పెరుగుతున్నాయి కానీ అధికారులు మాత్రం బడ్జెట్‌ తగ్గిస్తున్నారని ఆరోపించారు. 1996 నుండి 2020 వరకు నెలకు రూ.2.40 కోట్లు ఉన్న బడ్జెట్‌ 2024 లో నెలకు రూ.80 లక్షల నిధులతో పథకం నడపాలని ఉన్నత అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అధికారుల అసంబద్ధమైన నిర్ణయాలతో కాంట్రాక్టర్లు ముందుకు రాక వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సత్యసాయి నీటి పథకాన్ని ప్రభుత్వం నేరుగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు శ్రీరాములు, ధనుంజయ, నాగభూషన్‌, అంకన్న, పుల్లనాయుడు, వెంకట రమణ, శరత్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️