ఇంటి పన్నులు వేయాలని ధర్నా

ప్రజాశక్తి – ఒంగోలు సబర్బన్‌ : స్థానిక 50వ డివిజన్‌ జయప్రకాష్‌ కాలనీ ఎక్స్‌టెన్షన్‌లో ఇళ్లకు ఇంటిపన్నులు వేయాలని, తాగునీటి కులాయి కనెక్షన్లు ఇవ్వాలని కోరుతూ సిపిఎం జయప్రకాష్‌కాలనీ శాఖ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి జి. రమేష్‌ మాట్లాడుతూ జయప్రకాష్‌ కాలనీ ఎక్స్‌టెన్షన్‌లో 15 సంవత్సరాల కిందట ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. 10 ఏళ్ల కిందట మంచినీటి పైప్‌లైన్లు వేశారన్నారు. అక్కడ ఇళ్లకు పన్నులు లేని కారణంగా తాగునీటి కులాయి కనెక్షన్లు ఇవ్వడం లేదన్నారు. గత ప్రభుత్వం కులాయి కనెక్షన్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం కాలనీలో అన్నీ సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇంటిపన్నులు వేసి రూ.200కు తాగునీటి కులాయిలు ఇవ్వాలన్నారు. అనంతరం కార్పొరేషన్‌ కమిషనర్‌ కె. వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఇంటిపన్నులు వేసి, కులాయి కనెక్షన్లు ఇస్తామని కమిషనర్‌ ఈ సందర్భంగా కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు ఎస్‌డి.హుస్సేన్‌, కాలనీ కమిటీ నాయకులు డి.సుబ్బమ్మ, చిట్టిబాబు, యోహాను, ఎం.కమలమ్మ, కోటమ్మ, చంద్రమ్మ, కె.సలోమి తదితరులు పాల్గొన్నారు.

➡️