తాగునీటి సమస్య పరిష్కరించాలని ధర్నా

ప్రజాశక్తి-కనిగిరి : తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పట్టణ కార్యదర్శి పిసి. కేశవరావు ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మున్సిపల్‌ కమిషనర్‌ డేనియల్‌ జోసెఫ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ కనిగిరి పెద్దచెరువు, నాగల చెరువులను సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులుగా మార్చి ప్రజలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా సురక్షిత జలాలను అందించాలని డిమాండ్‌ చేశారు. కనిగిరి ప్రాంత ప్రజల నీటి సమస్య పరిష్కరించిన తర్వాతే మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్తామని ఎన్నికలకు ముందు ప్రచారంలో ప్రస్తుత పాలకులు హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని అమలు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకూ కనిగిరి ప్రాంత ప్రజల నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నీటి సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్‌కె. బషీరా, ప్రసన్న, శాంతకుమారి, నరేంద్ర, పిచ్చయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

➡️