ప్రజాశక్తి-బాపట్ల : కనీస సౌకర్యాలు లేక, వివిధ సమస్యలతో గ్రామాల్లోని ప్రజలు సతమతమవుతున్నట్లు సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్. గంగయ్య తెలిపారు. గ్రామాల్లోని సమ్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. మండల పరిధిలోని వెదుళ్ళపల్లి, వడ్డెర కాలనీ ,మాంటిసోరి కాలనీలో సిపిఎం నాయకులు ప్రజా చైతన్య యాత్ర గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. నివేశన స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ స్తంభాలు లేక అంధకారంలో కాలం గడుపుతున్నట్లు తెలిపారు. విషపురుగుల బెడదతో ఆందోళనకు గురుతున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో రైలు పట్టాలు ఉండడంతో వచ్చిపోయే రైలు శబ్దాలకు చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. గంత్యరం లేక మినరల్ వాటర్ కొనుగోలు చేసి దాహర్తీని తీర్చుకుంటున్నట్లు తెలిపారు. వెదుళ్ళపల్లిలో మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడంతో దోమల బెడద అధికంగా ఉందన్నారు. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో మురుగునీటి పారుదలను మళ్లించాలని విజ్ఞప్తి చేసినా ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. ఇళ్ల స్థలాల సమస్య ఉందన్నారు. అర్హులైన వృద్ధులకు వద్ధాప్య పెన్షన్లు రావడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండయ్య, సుభాషిణి, శరత్ ,కె.నాగేశ్వరరావు ,సాయిబాబు రెడ్డి, రమణారెడ్డి, స్పందన, కాలనీల ప్రజలుపాల్గొన్నారు. కొల్లూరు : సమస్యల పరిష్కారానికే ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఎం మండల కమిటీ సభ్యుడు బొనిగల సుబ్బారావు తెలిపారు. కొల్లూరు కేటీ కాలనీలో రెండో వార్డు పరిధిలో గురువారం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ప్రజలతో మాట్లాడివారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. తమ కాలనీ గ్రామానికి దూరంగా ఉండటంతో నిత్యం లోల్జేజీ సమస్య తలెత్తుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు. దోమలు విపరీతంగా ఉండడం వలన రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలాలు ఇవ్వాలని కోరారు. రేషన్ షాపులు ద్వారా కందిపప్పు ఇవ్వాలన్నారు. డ్రైనేజీని నెలకి ఒకటి రెండుసార్లు మాత్రమే శుభ్రం చేయడం వల్ల దోమలు వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ప్రకటించిన విధంగా ప్రతి మహిళకు నెలకు రూ.1.500 రూపాయలు ఇవ్వాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాయాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు బాపట్ల వెంకటేశ్వరమ్మ, సుశీల ,వైదేహి, తులసి, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు
