ప్రజాశక్తి – పూసపాటిరేగ : మండలంలోని ఎరుకొండ గ్రామంలో డయేరియా ప్రభలడానికి నీరు కలుషితం కావడమే కారణమని తేలింది. ఈమేరకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ప్రాథమిక అంచనా వేసింది. ఈనెల 3న ఈ గ్రామంలోని 14మంది డయేరియా భారిన పడిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థానిక పిహెచ్‌సిని, గ్రామాన్ని సందర్శించి, మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఈనెల 3న గ్రామంలో పర్యటించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం స్థానిక రాజవీధి, దళితకాలనీల్లో తాగునీటి పైపులైన్లు మరమత్తులకు గురయ్యాయని గుర్తించింది. దీంతో పాటు గ్రామంలోని కొంతమంది కుళాయి కనెక్షన్‌న్ల కోసం తవ్వకాలు చేపట్టారు. దీంతో, పైపులైన్లను పాడయ్యాయి. వీటి ప్రభావం వల్ల డయేరియా వచ్చి ఉండొచ్చని ఆ బృందం భావిస్తోంది. ఈనేపథ్యంలో కలెక్టర్ తాగునీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు, ఈ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గ్రామ పంచాయతీలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, తదితర శాఖల మధ్య సమన్వయం పెరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాల్సివుంది. లేదంటే గ్రామాల్లో గుర్ల లాంటి ఘటనలు చోటుచేసుకున్నా ఆశ్యపడాల్సిన అవసరం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.