గంజాయి అక్రమ రవాణాపై చర్యలు : డిఐజి

ప్రజాశక్తి-ములకలచెరువు రాష్ట్రంలో ఎక్కడా గంజాయి, మాదకద్రవ్యాల అమ్మకాలు జరగ కుండా వాటిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు కర్నూల్‌ రేంజ్‌ డిఐజి కోయ ప్రవీణ్‌ తెలిపారు. మంగళవారం సాయంకాలం ములకలచెరువు సర్కిల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులు, వాటి పరిష్కారాలపై సిఐ, ఎస్‌ఐలను ఆరా తీశారు. సర్కిల్‌ పరిధిలో ఎలాంటి గంజాయి అమ్మకాలు, మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం అమ్మకాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై పోలీసులకు వివరించారు. గంజాయి, మాదకద్రవ్యాలు అమ్మకాలు ఎక్కడ జరిగినా వాటిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు, దోపిడీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేయాలని తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం అమ్మకాలపై ప్రత్యేక దష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది వీటిని వ్యాపారంగా చేసుకొని గంజాయి అమ్మకాలు నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, డిఎస్‌పి కొండయ్య నాయుడు, సిఐ రాజా రమేష్‌, ఎస్‌ఐ గాయత్రి పాల్గొన్నారు.

➡️