గుంటూరులోని యాదవ హైస్కూల్లో నంబర్లు వేస్తున్న ఉపాధ్యాయులు
ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సోమవారం నుంచి మార్చి 31వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం జిల్లాలో మొత్తం 150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 29,449 మంది, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 961 మంది, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 1133 మంది మొత్తం 31,543 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్ష ఉంటుంది. కాగా మొదటి రోజు గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షా కేంద్రంలోకి పెన్ను, హాల్‌టిక్కెట్ తప్ప ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవీ అనుమతించరు. ఆరు సమస్యాత్మక కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. హాల్ టిక్కెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా 9951397109, 9052343447 నంబర్లలో సంప్రదించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి.రేణుక సూచించారు. కాగా గుంటూరులో పరీక్ష విధులు కేటాయించబడిన ఉపాధ్యాయులు ఆయా పరీక్షా కేంద్రాల్లో రిపోర్ట్ చేయకపోవటంతో 10 మంది ఉపాధ్యాయులకు గుంటూరు తూర్పు మండల విద్యాశాఖాధికారి ఖుద్దూస్ షోకాజు నోటీసులు జారీ చేశారు. పి.హరికృష్ణ, సత్యవతి దెబోరా, పి.చెంచులయ్య, జె.సాంబ్రాజ్యలక్ష్మి, సిహెచ్.శ్రీనివాసరావు, ఇ.నాగమల్లేశ్వరి, కె.బాలకృష్ణ, జె.జేమ్స్, ఎన్.సుజాత, ఎస్.శౌరిరెడ్డి వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్‌కు ముందుగా రిపోర్ట్ చేయకపోటంతో ఎంఇఒ షోకాజులిచ్చారు.
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సోమవారం నుండి జరిగే పరీక్షలకు పల్నాడు జిల్లాలో ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. నరసరావుపేటలోని స్టోరేజ్ సెంటర్ నుండి ప్రశ్నపత్రాలను పోలీసుల పహారా మధ్య ఇప్పటికే భద్రపరిచారు. పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 26497 మంది విద్యార్థులు హాజరుకానుండగా 128 కేంద్రాలను ఏర్పాటు చేశౄరు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయానికి గంట ముందుగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. సరైన కారణం చూపినట్లయితే 5 నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించనున్నారు. పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరయ్యే వీలు కల్పించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూం నంబర్8341135357కు సంప్రదించొచ్చు.పరీక్షలను నిర్వహణ కోసం 128 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 128 మంది డిపార్టెమెంట్ అధికారులను, 4 అదనపు బృందాలతో పాటు 1680 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు, ఆన్లైన్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద మెడికల్ కిట్, ఎఎన్‌ఎం అందుబాటులో ఉంటారు. నిరంతరం విద్యుత్ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. నరసరావుపేట మండలం లింగంగుంట్ల శంకర భారతిపురం జిల్లా పరిషత్ హైస్కూల్, బొల్లాపల్లి మండలం బండ్లమోటు, రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలెం, కారంపూడి, క్రోసూరు, విజయపురిసౌత్ జిల్లా పరిషత్ హైస్కూళ్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా 6 ఫ్లయింగ్ స్కాడ్‌లను ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం యధావిధిగా కొనసాగనుంది. రెగ్యులర్, ఓపెన్ పరీక్షలు జరిగే పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. పరీక్షల అనంతరం సెలవురోజైన 2వ శనివారం తరగతులు నిర్వహించనున్నారు.
పిల్లల్ని ఒత్తిడికి గురిచేయొద్దు : డిఇఒ చంద్రకళవిద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. పిల్లలను తల్లిదండ్రులు ఒత్తిడికి గురిచేయొద్దు. విద్యార్ధికి ఏ సమస్య ఉన్నా కంట్రోల్ రూంకు ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తాం. విద్యార్థులు ఎటువంటి భయాందోళనకూ గురి కాకుండా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలి.
