నైరాశ్యం

Jun 8,2024 20:25 #నైరాశ్యం

సార్వత్రిక ఎన్నిక వైసిపిలో నైరాశ్యాన్ని నింపింది. సంక్షేమాన్ని నమ్ముకుని పార్టీని గాలికి వదిలేసిన ఫలితం వైసిపికి చేదుఅనుభవాల్ని మిగిల్చింది. పార్టీని, ప్రభుత్వాన్ని వొలపటి…దాపటి ఎద్దుల చందంగా సమన్వ యంగా నడిపించడంలో వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. వైఎస్‌ జగన్‌ నెలనెలా సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం డిబిటి, నాన్‌ డిబిటి పద్ధతుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సంగతి తెలిసిందే. సంక్షే మాన్ని నమ్ము కుని పార్టీ కేడర్‌ను విస్మరించిన ఫలితమే ఘోర ఓట మికి దారి తీసింది. అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులకు పనులు కేటాయింపులు చేయకపోవడం, అత్తెసరు బిల్లుల్ని సైతం సకాలంలో చెల్లించకపోవడంతో భూకబ్జాలకు భారీ ఎత్తున తెర తీశారు. బద్వేల్‌లో తహశీల్దార్‌ సీళ్లతో సహా డాక్యుమెంట్లను స్వాధీ నం చేసుకుని పలువురిపై ఆర్డీఓ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇంత లోనే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే భూముల్నే కబ్జా చేయడం, ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త స్థలాన్ని సైతం కబ్జా చేయడానికి ప్రయత్నించడం, ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించడం, వదిలిపెట్టడం వరకు సాగిపోయింది. చివరికి కడప నగర సమీపంలోని స్మశానాల్ని సైతం ఆక్రమించుకుని హౌసింగ్‌ లేఅవుట్‌ వెంచ ర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఇసుక అక్రమ రవాణాకు అంతు లేకుండాపోయింది. అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య, పింఛా రిజర్వాయర్లు కొట్టుకుపోవడానికి అధి కార పార్టీకి చెందిన ఇసుకా సురులే కారణం కావడం గమనార్హం. దీనిపై విధులు నిర్వహించడానికి వెళ్లిన పాత్రికే యులపై కేసులు నమోదు చేయించడం వరకు హద్దు లేకుండా చెలరేగిపోవడం పరా కాష్టకు చేరుకుంది. ప్రపంచంలోనే ఎక్కడా లభించని అరుదైన ఎర్ర చంద నం స్మగ్లింగ్‌ హద్దు లేకుండా చెలరేగిపోవడం చర్చనీయాం శంగా మారింది. మూడేళ్ల కిందటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాట వినని ప్రతిపక్ష అభ్యర్థులను ఎర్రచందనం దుంగల పేరుతో తప్పుడు కేసులు పెడతామనే బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకోవడం దారుణం. ఇటువంటి అవాంఛనీయ వాతావ రణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ఆగ్రహావేశాలు వైసిపి అహం కారానికి గట్టిగా బుద్ది చెప్పాయనే విశ్లేషణలు వినిపిస్తుండడం గమనార్హం. కడప, రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థులు వైసిపికి చెందిన సిట్టింగ్‌ ఎంపీలు అత్తెసరు మెజార్టీలతో గెలుపొందడం స్వల్ప ఉపశమనాన్ని కలిగించింది. కడప పార్ల మెంట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌ షర్మిలకు పెద్ద ఎత్తున క్రాస్‌ఓటింగ్‌ నడిచింది. గుడ్డి తప్పి కన్ను లొట్ట బొయిన చందంగా గెలుపొందడం పలువురి దృష్టిని విశేషంగా ఆకర్షిం చింది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే పులివెందుల, బద్వేల్‌, రాజంపేట, తంబళ్లపల్లి మినహా మిగిలిన తొమ్మిది అసెంబ్లీ స్థానాల్ని ప్రతిపక్ష టిడిపి ఎగరేసుకునిపోయింది. పులివెందుల మెజార్టీ మినహాయిస్తే మిగిలినవన్నీ అత్తెసరు మెజార్టీలే కావడం గమనార్హం. ఇప్పటికైనా వైసిపి నాయ కత్వం పార్టీ నేతలను క్రమశిక్షణలో పెట్టి అదుపులో ఉంచితేనే ప్రజాభిమానానికి పాత్రులవుతారని చెప్ప వచ్చు.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️