ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ

Oct 1,2024 21:39

 ప్రజాశక్తి-విజయనగరం కోట/గజపతినగరం  : జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా పింఛను మొత్తాల పంపిణీ కార్యక్రమం మంగళవారం తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు అన్ని వార్డులు గ్రామాల్లో ముమ్మరంగా సాగింది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఆయా మండలాల్లో పింఛను పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మెంటాడ మండలం ఆండ్ర, లోతుగడ్డ గ్రామాల్లో పింఛను పంపిణీ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో మంత్రి ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ దారులకు మొత్తాలను అందజేశారు. గజపతినగరం మండలం పురిటిపెంట, బొండపల్లి మండలం అంబటి వలస గ్రామాల్లో పెన్షన్‌ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు పింఛనుదారులతో కలెక్టర్‌ మాట్లాడారు. అనంతరం డిఆర్‌డిఎ కార్యాలయంలో జిల్లాలో పింఛన్లు పంపిణీ జరుగుతున్న తీరును కలెక్టర్‌ సమీక్షించారు. కలెక్టర్‌ వెంట జెడ్‌పి సిఇఒ సత్యనారాయణ, గజపతినగరం ఎంపిడిఒ కిశోర్‌కుమార్‌, తహశీల్దార్‌ రత్నకుమార్‌ తదితరులు ఉన్నారు. జిల్లాలో అక్టోబర్‌ నెలలో మొత్తం 2,78,240 మందికి పింఛన్‌ మొత్తాలు పంపిణీ చేయాల్సి ఉండగా మధ్యాహ్నం రెండు గంటల సమయానికి రెండు లక్షల 70 వేల 130 మందికి పింఛన్‌ మొత్తాలు అందజేసినట్లు డిఆర్‌డిఎ పీడీ కల్యాణ్‌చక్రవర్తి తెలిపారు. 97.09 శాతం మందికి ఫించన్‌ మొత్తాల పంపిణీ పూర్తి అయ్యిందన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్నాం : ఎమ్మెల్యే విజయనగరం టౌన్‌ :టిడిపి హయాంలో సంక్షేమ పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. దాసన్నపేట, నవాబుపేట లోనూ, కెఎల్‌ పురం మొండవీధిలో లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ పి. నల్లనయ్య, సహాయ కమిషనర్‌ సిహెచ్‌ తిరుమలరావు, టిడిపి నాయకులు ఐవిపి రాజు, స్థానిక కార్పొరేటర్‌ గాదం మురళి పాల్గొన్నారు

➡️