పెట్టుబడి సాయం ఎగ్గొట్టేందుకు కుట్ర
ఆందోళనలో ఆర్‌ఒఎఫ్‌ఆర్, డి-పట్టాదారులు, కౌలు రైతులు
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : గుర్తింపు పేరుతో రైతులకు శఠగోపం పెట్టేందుకు, వారి మధ్య అంతరాలు సృష్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయా? అంటే రైతు సంఘాలు, వ్యవసాయ రంగంపై అవగాహన కలిగిన రైతుల నోట ఔను..! అనే సమాధానం వినిపిస్తోంది. ఎపి ఫార్మర్ రిజిస్ట్రేషన్ పేరిట గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ నెంబర్, పేరు ఆధారంగా సొంత భూమి ఉన్న రైతులను గుర్తిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 10వ తేదీ నుంచి జిల్లాలో ఈ కార్యక్రమం మొదలైంది. ఇందులో కేవలం సొంత భూమి ఉన్నవారికి మాత్రమే గుర్తింపు లభిస్తోంది. అటవీహక్కుల చట్టం ప్రకారం పొందిన ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాలు, డి-పట్టాలు, కౌలు రైతులకు గుర్తింపు లేదు. ఇటువంటివారి వివరాలను ప్రభుత్వం రూపొందించిన వెబ్-సైట్ స్వీకరించడం లేదు. దీంతో, ఆయా రైతుల్లో ఆందోళన మొదలైంది. కేంద్ర అందిస్తున్న పిఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న పెట్టుబడి సాయం భారాన్ని తగ్గించుకునేందుకే ఫార్మర్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న అనుమానాలు ఊపందుకున్నాయి. మన జిల్లాలో రైతుల సంఖ్య 2.80లక్షల మంది ఉన్నట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఇప్పటి వరకు రైతు సేవాకేంద్రాల్లో 19,9,599 మంది రైతులు గుర్తింపు పొందినట్టు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలిన రైతుల కూడా కేంద్రాలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నారు. అప్పటికీ మిగిలిపోతే రైతుల ఇళ్లకు వెళ్లి వారి గుర్తింపు నమోదు చేయాలని కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, అందరి రైతులనూ ఎందుకు గుర్తించడం లేదన్నది రైతులు, రైతు సంఘాల వాదన. జిల్లాలో ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాలు, డి-పట్టాలు, డికెటి -పట్టా కౌలు రైతుల గుర్తింపు కార్డులను సర్కారు వారి వెబ్‌సైట్ పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇక అనధికారికంగా పొండపొరం బోకు తదితర పేర్లతోవున్న ప్రభుత్వ భూముల్లోనూ ఎంతో మంది వివిధ పంటలు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో చాలా మంది అడంగల్‌లో గుర్తింపబడి కూడా ఉంటారు. ఇవేవీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో, ఆయా పట్టాలు, పత్రాలకు కంప్యూటర్‌లో ఆప్షన్ ఇవ్వలేదంటూ రైతు సేవాకేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు తేల్చి చెబుతున్నారు. దీన్నిబట్టి జిరాయితీ భూమి ఉన్న రైతు లు, డి-పట్టా, ఆర్‌ఒ ఎఫ్‌ఆర్ పట్టాదారులు మధ్య ప్రభు త్వం వివక్ష చూపు తోందని స్పష్టమౌతోంది. ఇక కౌలు దారుల విషయా నికి వస్తే…. మన జిల్లాలో పెద్ద రైతుల భూములు సాగుచేసిన వారు, ఇనాం, దేవాదాయ తదితర భూము లు సాగుచేస్తున్న కౌలు రైతులు సుమారు లక్ష మంది వరకు ఉన్నారని రైతు సంఘం అంచనా. ప్రభుత్వం మాత్రం ఏటా 16,500 మందికి మించి కౌలు గుర్తింపు కార్డులు జారీచేయడం లేదు. ఈ ఏడాది కూడా 16,243 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో నమోదుకు అసలు అవకాశమే కల్పించకపోవడంతో వీరుకూడా గుర్తింపునకు నోచుకునే అవకాశం లేదు. దీన్నిబట్టి పిఎం కిసాన్ పేరిట కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన పెట్టుబడి సాయం ఎగ్గొట్టేందుకే ఈ రైతు గుర్తింపు ప్రక్రియ చేపట్టారని రైతులు, రైతు సంఘం నాయకులు అనుమానిస్తున్నారు. క్రమంగా రైతుల సంఖ్యను తక్కువ చేసి వివిధ రూపాల్లో ఇవాల్సిన సబ్సిడీలను ఎగ్గొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం భారాన్ని తగ్గించుకునేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొచ్చిందేనే చర్చ సాగుతోంది.
భూధార్ ప్రక్రియను నిలిపివేయాలి
ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ఇవ్వకపోవడమే కాకుండా అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న పెట్టుబడి సాయం కూడా ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తోంది. కౌలు రైతులకు, డి-పట్టాదారులకు రిజిస్ట్రేషన్ లేకుండా చేసింది. వెంటనే వీరికి పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆందోళన చేపడతాం.
– బి.రాంబాబు, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి