ప్రజాశక్తి-విజయనగరం కోట : సింహా చలం దేవస్థానం పంచ గ్రామాల భూముల విషయమై సింహాచలం దేవస్థానం చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు సమక్షాన జిల్లాకు చెందిన రాష్ట్ర చిన్న,మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు టిడిపి కార్యాలయంలో చర్చించారు. అశోక్ గజపతిరాజు విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఈ భూములు భక్తులు దేవుడికి ఇచ్చిన ఆస్తులని, రక్షణ విషయంలో స్పష్టత వస్తే పరిష్కారం వస్తుందని అన్నారు. ఈ విషయం తన తండ్రి నాటి నుంచి రగులుతున్న సమస్యగాఉందని, స్పష్టత ఉండి ముందుకు వెళితే ఎంత జటిలమైన సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని అన్నారు. దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు విలేకర్లతో మాట్లాడుతూ దేవస్థానం భూముల సెటిల్మెంట్ నిమిత్తం చైర్మన్ అనుమతి కోసం వచ్చామని తెలిపారు. ఏదైతే 420 ఎకరాల భూమి ఉందో దానిపై ఇప్పటికే ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకొని శతాబ్దాలుగా ఉంటున్నారని తెలిపారు. దానికి సరి సమానంగా 620 ఎకరాల భూమితో పాటు రెగ్యులైజేషన్ లో వచ్చిన డబ్బులు కూడా ఇస్తామని తెలిపారు. దీనికి చైర్మన్ అశోక్ గజపతిరాజు సానుకూలంగా స్పందించారని తెలిపారు. సమావేశంలో జిల్లాకు విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.రమేష్‌బాబు, ప్రభుత్వ విప్ గణబాబు, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.