నెల్లిమర్లపై చర్చ

May 15,2024 21:12

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపికి గత ఆధిక్యం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూటమి అభ్యర్ధి జనసేనకు వచ్చేనా అని నెల్లిమర్లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెల్లిమర్ల అసెంబ్లీకి వైసిపి, జనసేన బరిలో నిలిచి తల బడ్డాయి. అయితే ఓటింగ్‌ శాతం పెరగడంతో ఎవరికి నష్టం వాటిల్లుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎవరికి వారే తమదే గెలుపంటే తమదే గెలుపని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైసిపి, జనసేన హోరాహోరీగా తలబడినట్లు తెలిస్తోంది. యువ ఓటర్లు జనసేనకు ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. సీనియర్లు, మహిళలూ వైసిపికి మొగ్గు చూపినట్లు చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే నగర పంచాయతీ పరిధిలో నెల్లిమర్ల, జరజాపుపేట గ్రామాల్లో మాత్రం జన సేనకు అధిక శాతం మొగ్గు చూపారని చర్చ జరుగుతుంది. గాజు గ్లాస్‌, బకెట్‌ గుర్తుల వల్ల కొంత మంది ఓటు వేసినప్పుడు ఈ రెండు గుర్తులు ఒకే వరుస క్రమంలో ఉండడం వల్ల ఇబ్బంది పడటం వల్ల కొన్ని ఓట్లు పోతాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా ఉత్కంఠ భరిత పోరులో జూన్‌ 4వరకు ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.

➡️