ప్రభుత్వ విద్యతోనే అసమానతలు దూరం

Apr 14,2024 00:14

సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు
ప్రజాశక్తి-గుంటూరు :
ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్య కొనసాగితేనే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. రాజ్యాంగ లక్ష్యాలైన అసమానతలు తొలగించటానికి ఉపాధ్యాయులు విద్యారంగ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాలలో భాగంగా శనివారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో విద్యా సదస్సు నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సులో పాల్గొన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రముఖ ఆర్థికవేత్త, స్వతంత్ర జర్నలిస్టు డి.పాపారావు ఆర్థిక, రాజకీయ కేంద్రీకరణలు-పర్యవసానాలు అనే అశంపై ప్రసంగించారు. ‘ఆర్థిక సంస్కరణలు- విద్యా రంగంపై ప్రభావం’ అనే అంశంపై ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 45 ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్భంద విద్య అందించాలని, ఆదేశిక సూత్రాలలో ప్రభుత్వ రంగంలోనే విద్య ఉండాలని స్పష్టంగా ఉందన్నారు. కానీ 1991 తర్వాత సంస్కరణల ఫలితంగా విద్యరంగా ప్రైవేటు, కార్పొరేట్‌ పరం అయ్యి పేదలకు విద్య దూరం అవుతుందన్నారు. ప్రస్తుతం విద్యా రంగంలో పేద, ధనిక తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషించారు. ప్రభుత్వ బడులలో పేదలు మాత్రమే చదువుతున్నారని చెప్పారు. సంస్కరణలను పారిశ్రామిక రంగానికే పరిమితం చేస్తామన్న పాలకులు అన్ని రంగాల్లో అమలు చేశారని, విద్య, వైద్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు. దేశంలో సుమారు 950 యూనివర్సిటీలు ఉంటే వాటిలో 500 ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నాయ న్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిరక్షణకు ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యుటిఎఫ్‌ స్థాపించి 50 ఏళ్లవుతున్న సందర్బంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాలకులు ఎవరైనా విధానాల ప్రాతిపదికగా, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. సదస్సులో యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాసరావు, కె.సురేష్‌కుమార్‌, ఎఎన్‌. కుసుమ కుమారి, ఎస్‌ఎస్‌ నాయుడు, జి.వి.రమణ, టిఎస్‌ఎన్‌ఎల్‌ మల్లేశ్వరరావు, ఎం.హనుమంతరావు, గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌, పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌, బాపట్ల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.వినరుకుమార్‌, ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️