ప్రజాశక్తి-రాయచోటి మారుమూల పల్లెల్లో నివసించే గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా విఫలం అవుతూనే ఉన్నాయి. దీని వల్ల వారి అభివద్ధి కుంటుపడుతోంది. 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అభివద్ధికి ఆమడ దూరంలో గిరిజనులు ఉన్నారు. గిరిజనుల్లో ఒక తెగగా చెప్పుకునే యానాదులు ఏ ఒక్క ప్రభుత్వ పథకాలు అందుకోలేని అనాథలుగా మిగిలిపోవడం శోచనీయం. గుట్ట, పుట్ట పట్టుకుని పూట గడుపుతున్న యానాదుల ధీనగాధ అంతా ఇంతా కాదు. జిల్లాలో సుమారు 75 యానాదులు కాలనీలున్నాయి. సుమారు లక్షకు పైగా జనాభా ఉన్నారు. ఆధార్ లేక కొందరు, రేషన్ లేక మరి కొందరు, ఒకవేళ రైతన్న ఆధార్ ఉన్న ఇకెవైసి, ఫోన్ నెంబర్ లింక్ వసతులు లేక, ప్రభుత్వ పథకాలు పక్కా గహాలు, వద్ధాప్య పింఛన్, తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్‌కు వారు దూరమవుతున్నారు. కనీసం వారికి రావాల్సిన ప్రభుత్వ పథకాలు కూడా అందడం లేదు. యానాదులపై జిల్లాలో అధికారులు నిర్లక్ష్యం ఎక్కువ శాతం కనబడుతోంది. జిల్లాలోని రైల్వేకోడూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబులవారిపల్లి, రాయచోటి, గాలివీడు, రామాపురం మండలాల్లో యానాదుల కాలనీలున్నాయి. వారిని అభివద్ధి చేసేందుకు నెల్లూరు జిల్లాలో ఐటిడిఎ ఆఫీసు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు అధికారి ఇంత వరకూ యానాది కాలనీలవైపు కన్నెత్తి కూడా చూడక పోవడం శోచనీయం. కనీసం యానాదులు సమస్యలు పరిష్కరించడానికి మొగ్గు చూపడం లేదు. యానాదులు వెనుక బడిబాట కారణం ఐటిడిఎ అధికారులే. ఇప్పటికైనా స్పందించి యానాదులకు అభివద్ది, సంక్షేమ పథకాలు అందేలా ఉన్నతాదికారులు ధర్యలు తీసుకోవాలని జిల్లాలోని పలువురు యానాదులు కోరుతున్నారు. ఆధార్ కార్డుల కోసం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నివేదికలు పంపినా నెల్లూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చీమ కుటినట్లు కూడా లేదని పలువురు యానాదులు వాపోతున్నారు. యానాదులు కోసం ప్రత్యేక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని యానాది సంక్షేమ సంఘం వినతి పత్రం సమర్పించినా ప్రాజెక్టు అధికారి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని యానాది సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు లేక తమ పిల్లలను స్కూళ్లల్లో కూడా చేర్పించలేని. పరిస్థితి నెలకొందిని, దీని వల్ల దీనివలన పిల్లలకు రావాల్సిన తల్లికి వందనం. ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్లో సీట్లు వంటివి కోల్పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. అధికారులు స్పందించాలి యానాదులు ఎక్కువగా ఉన్న రైల్వేకోడూరులో ప్రత్యేక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఉన్నటువంటి యానాది కాలనీ గడప గడపకూ ప్రభుత్వ అధికా రులు తిరిగి వారికి కావాల్సిన ఆధార్, రేషన్, ఫోన్ లింక్ ఇతర మౌలిక వసతులను కల్పించాలి. ఐటిడిఎ నిధులు యానాది కాలనీల అభివద్ధి కోసం ఖర్చు చేయాలి. ఇప్పటికైనా ప్రజాప్ర తినిధులు, అధికారులు, ఐటిడిఎ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి.- జి.శివయ్య, జిల్లా అధ్యక్షులు, యానాదులు సంక్షేమ సంఘం. అన్నమయ్య జిల్లాఆందోళన అవసరం లేదు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో సచివాలయం, మండలం ఎంపిడిఒ కార్యాలయాలలో ఆధార్ లాగిన్ ఓపెన్ అవుతుంది. ఎవరైనా విద్యార్థులు ఆధార్, రేషన్ కార్డ్ లేని వారు అక్కడికి వెళ్లి పరిశీలించుకోవచ్చు. లేనివారికి ఆధార్ కార్డు రేషన్ కార్డు అక్కడే వారు అందజేస్తారు. లేనియెడల తమ కార్యాలయానికి ఎవరైనా వచ్చిన కలెక్టర్ దష్టికి తీసుకెళ్లి వారికి కావాల్సిన ఆధార్, రేషన్ కార్డును ఏర్పాటు చేస్తాం.- పి.తేజస్విని, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, అన్నమయ్య జిల్లా.
