ప్రజాశక్తి – గుర్ల : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. గతంలో డయేరియా బారినపడి పదిమంది మృతి చెందిన సంఘటన తెలిసిందే. వారి కుటుంబాలకు శనివారం గుర్లలో రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు బాధితులను పరామర్శించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని గుర్తు చేశారు. మాట తప్పకుండా వారి కుటుంబాలకు చెక్కులు అందజేశామని అన్నారు. ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్న 450 కుటుంబాలను పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో ఆదుకున్న ఘనత ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో టిడ్కో చైర్మన్ ఉదరు కుమార్, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ చైర్మన్ శివశంకర్, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్విని, బిజెపి జిల్లా అధ్యక్షులు రాజేష్‌వర్మ, జనసేన నాయకులు వసరావు, పడాల అరుణ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
