పాలుట్లకు ఎన్నికల సామగ్రి పంపిణీ

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పాలుట్ల పోలింగ్‌ కేంద్రం జిల్లాలోనే మొట్ట మొదటిది. ఈ పోలింగ్‌ కేంద్రానికి మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో ఎన్నికల సమయంలో హెలికాప్టర్‌ ద్వారా సిబ్బందిని తరలించి తిరిగి హెలికాప్టర్‌ ద్వారానే సిబ్బందిని తీసుకొచ్చేవారు. అయితే మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిన తర్వాత కమాండర్‌ వాహనాల ద్వారా సిబ్బందిని తరలిస్తున్నారు. సోమవారం జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆదివారం యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాలుట్ల పోలింగ్‌ సిబ్బందికి నియోజకవర్గ ఎన్నికల అధికారి డాక్టర్‌ పి శ్రీలేఖ ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలుట్ల పోలింగ్‌ కేంద్రంలో 509 మగ, 457 స్త్రీ ఓటర్లు కలిపి మొత్తం 966 ఓట్లు ఉన్నట్లు తెలిపారు. పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్నికల విధులను నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో ఎలాంటి సందేహాలు తలెత్తినా ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన హ్యాండ్‌ బుక్‌ చదవాలని చెప్పారు. పోలింగ్‌ సిబ్బంది సమిష్టిగా పని చేయాలని కోరారు. ఆమె వెంట ఏఈఆర్వో సోమ్లా నాయక్‌ తదితరులు ఉన్నారు.

➡️