స్టడీ మెటీరియల్‌ పంపిణీ

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌ : మండల పరిధిలోని రాయవరం గ్రామంలోని కస్తూరిబాయి గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి) విద్యార్థినులకు మార్కాపురం యూటీఎఫ్‌ మండల శాఖ పక్షాన మండల ప్రధాన కార్యదర్శి వినుకొండ రాజేష్‌ చేతుల మీదుగా ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి వినుకొండ రాజేష్‌ మాట్లాడుతూ అత్యంత అనుభవజ్ఞులచే రాయబడిన ఈ మెటీరియల్‌, పదో తరగతి విజయ సాధనలో కీలకపాత్ర పోషిస్తుందని, దీన్ని ఉచితంగా కేజీబీవీ విద్యార్థినులకు అందించడం ద్వారా వారిని మరింత బాగా చదివించేందుకు తోడ్పడుతుందని తెలిపారు. బాలికలు అన్ని రంగాలలో రాణించాలని, విద్యలో మరింత ముందుండాలని ఆకాంక్షించారు. దీనికి సహకరించిన దాతలు రాయవరంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పి రమాదేవి, బోడపాడులో పనిచేస్తున్న జీవీ సురేఖ, రాష్ట్ర మాజీ నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయులు ఆర్‌ఎం ఝాన్సీపాల్‌, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ మండల శాఖ పక్షాన అధ్యక్షులు జయరామిరెడ్డి, మండల కుటుంబ సంక్షేమ పథక కన్వీనర్‌ పి పిచ్చయ్య, జిల్లా కార్యదర్శి పి వెంకటేశ్వర్లు, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ విజయ, విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తర్లుపాడు: మండల కేంద్రమైన తర్లుపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టియు) మండల అధ్యక్షుడు కశెట్టి వెంకట జగన్‌బాబు, కార్యదర్శి షేక్‌ నజీర్‌ అహ్మద్‌ ఇరువురి ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జగన్‌బాబు మాట్లాడుతూ ఎస్టియు టీచర్స్‌ సహకారంతో అందజేస్తున్న స్టడీ మెటీరియల్స్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఏడాది మార్చిలో జరగబోయే పబ్లిక్‌ పరీక్షలలో పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేలా పట్టుదల, క్రమశిక్షణతో, విద్యను అభ్యసించి, భవిష్యత్‌ తరాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పదో తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.

➡️