ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Dec 9,2024 17:53 #nandhyala

ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్ : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో అధికారుల బృందాలు సమన్వయంతో పనిచేసి అన్ని పారామీటర్లలో జిల్లాను ముందు స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పీజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో కోఆర్డినేషన్ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల లక్ష్యసాధనను అధికార బృందాలు క్షేత్రస్థాయిలో సమయస్ఫూర్తితో పనిచేసి అన్ని పారామీటర్లలో ముందుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిఆర్డిఏ, డిఎంహెచ్ ఓ ఇతర శాఖలు ప్రాధాన్యత కార్యక్రమాల లక్ష్య సాధనలో కుంటు పడిన అంశాలను తన దృష్టికి తీసుకువచ్చి సమీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ల సదస్సులో ప్రతి అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్లాట్లు ఇచ్చి క్షుణ్ణంగా సమీక్షిస్తున్న నేపథ్యంలో అధికారులు నిర్దేశిత లక్ష్యసాధనపై దృష్టి సారించి నివేదికలు ఇవ్వాలన్నారు. జిల్లాలో వరి, ఇతర ధాన్యపు పంట దిగుబడులను రోడ్లపై ఆరవేస్తున్నారని అకాల వర్షం కారణంగా ధాన్యం తడవకుండా రైతులను అప్రమత్తం చేయాలని విలేజ్ గ్రామ వ్యవసాయ అధికారులు, రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఈ పంట బీమా ప్రీమియం చెల్లింపు కింద వివిధ పంటలకు తక్కువ రుసుమును ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తే దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లిస్తుందన్న అంశాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించాలన్నారు. తొలిరోజు నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై 430 గ్రీవెన్స్ వచ్చాయని వీటన్నింటిని ఆన్లైన్ చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భూ సమస్యలతో పాటు స్వీకరించిన ఇతర సమస్యలను కూడా అదర్ సోర్సెస్ కింద అప్లోడ్ చేసుకుని పరిశీలించాలన్నారు. ఆదివారం జరిగిన జడ్పీ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన దొర్నిపాడు బాయ్స్ హాస్టల్ సమీపంలో ఉన్న వైన్ షాపుపై చేసిన ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం పరిశీలించి సంబంధిత మద్య దుకాణంపై వెంటనే నివేదికలు ఇవ్వాలని ఎక్సైజ్ సూపరిండెంటెంట్ ను కలెక్టర్ ఆదేశించారు. సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొవలని డిఆర్ఓ, ఇరిగేషన్ ఎస్ఈని ఆదేశించారు. మెగా పేరెంట్ టీచర్ల సమావేశాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు సంబంధించి అధికారులను కలెక్టర్ అభినందించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల డేటాను కూడా వేగవంతం చేయాలన్నారు.

➡️