పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతాపరమైన చర్యలను జిల్లా ఎస్పీ, ఆర్‌. గంగాధరరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. పాండురంగ హై స్కూల్‌, భాష్యం ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌, కే.కే.ఆర్‌ గౌతమ్‌ స్కూల్‌ ,నిర్మల ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌ పరీక్షా కేంద్రాలను పరిశీలించి, అక్కడ పోలీస్‌ అధికారులతో మాట్లాడి బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు .అనంతరం ఎస్పీ మాట్లాడుతూ … విద్యార్థులను నిర్దేశించిన సమయంలోపు కేంద్రాల్లోనికి తనిఖీ చేసి అనుమతించాలన్నారు.జి ఎం స్‌ కె లతో విద్యార్థులను తనిఖీ చేయించాలని, పబ్లిక్‌ అడ్రెస్సింగ్‌ సిస్టం ద్వారా పరీక్షా కేంద్రం బయట ఎవరిని గుమి కూడకుండా హెచ్చరించి పంపించి వేయాలని సూచించారు.పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ ను అమలు చేసి, విద్యార్ధులు మినహా ఇతరులను అనుమతించ కూడదని,బహిరంగంగా గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని, పోలీసు అధికారుల, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విద్యార్థులందరూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలని మాస్‌ కాపీయింగ్‌ కు, మాల్‌ ప్రాక్టీస్‌ లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉండే జిరాక్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్లు పరీక్ష ముగిసే అంతవరకు తెరవడానికి వీలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.ప్రశ్నాపత్రాల భద్రత కోసం స్ట్రాంగ్‌ రూముల వద్ద పోలీస్‌ సిబ్బంది , పరీక్షా పత్రాల రవాణా సమయంలో కూడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్‌ ఆఫీసర్లు, పరీక్షా కేంద్ర సూపరింటెండెంట్‌ లు ఎవరు పరీక్షా కేంద్రాలలోనికి వాచీలు, క్యాలిక్యులేటర్స్‌, సెల్‌ ఫోన్స్‌ తీసుకురాకూడదు అని సూచించారు.పరీక్షా కేంద్రం పరిసరాలలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని, పరీక్షకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, పరీక్షలు పూర్తయ్యే వరకు అధికారులు ,మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విధులు నిర్వర్తించే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌ అధికారులు అందరూ వారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.

➡️